మోడీ మళ్లీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు.. టీడీపీ గెలుపు ఖాయం: చంద్రబాబు

ఏపీలో టీడీపీ విజయం తథ్యమని, కేంద్రంలో మోడీ మళ్లీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాలుగు రకాల సర్వేలు చేయించాం.. అన్నింట్లో టీడీపీ గెలుపు ఖాయంగా వచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే తమకు శ్రీరామ రక్ష అన్నారు. దేశంలో బీజేపీ ఓటమి ఖాయమైపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ నేతలతో అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో భేటీ అయ్యారు. పోలింగ్‌ సరళిని నేతలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు.. ఓట్ల లెక్కింపు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ మాత్రం శాశ్వతం. మొన్న బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేశాం. నిజానికి ఏపీలో ఎన్నికలు మే నెలలో రావాల్సి ఉంది. తొలి దశలో ఎన్నికలు నిర్వహించి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. స్వల్ప గడువుతో టీడీపీను దెబ్బ తీయాలనుకున్నారు. కానీ, అదే మన పార్టీకి బాగా కలిసి వచ్చింది. చెడు చేయాలనుకున్నా.. టీడీపీకి మంచే జరిగింది. రాష్ట్ర, దేశ రాజకీయాలను అధ్యయనం చేయాలి’ అని సూచించారు.

‘ప్రతినెలా తొలి వారంలో లబ్ధిదారులకు పింఛన్లు, ఆర్థిక సాయం అందజేస్తాం. మంచికి మారు పేరు టీడీపీ అయితే.. దుర్మార్గులకు మారు పేరు వైసీపీ, బీజేపీ. ఓడిపోతారని తెలిసి కూడా వైసీపీ బుకాయిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇలాగే నాటకాలాడారు. మే 23న ఓట్ల లెక్కింపులో టీడీపీ గెలుపు లాంఛనం మాత్రమే. ఏపీలో టీడీపీ విజయం సాధించడం తథ్యం’ అని పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు అన్నారు.

మోడీ పాలనలో ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడాం. గత ఐదేళ్లలో దేశానికి జరిగిన నష్టంపై యుద్ధం చేశాం. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేశాం. బీజేపీ నాయకులు 28 ఏళ్ల క్రితం మరణించిన రాజీవ్‌ గాంధీ గురించి మాట్లాడుతున్నారు. సైన్యం చేసిన త్యాగాల ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారు. ఐదేళ్లలో మోడీ మన దేశానికి చేసిందేమీ లేదు. తానేమీ చేయలేదు కాబట్టే ప్రజలకు ఏమీ చెప్పలేకపోతున్నారు. మోడీ మాటల్లో ఓటమి నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నంద్యాల, కర్నూలు లోక్‌సభ సీట్లలోనూ టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయం. సంస్థాగత బలమే ఈ ఎన్నికల్లో టీడీపీకి అక్కరకు వచ్చింది’ అని చంద్రబాబు అన్నారు.

టీడీపీలో 65లక్షల మంది కార్యకర్తలు, 4 లక్షలమంది సేవామిత్రలు, 45వేల మంది బూత్‌ కన్వీనర్లు, 5 వేల మంది ఏరియా కన్వీనర్లు ఉన్నారు. అందరూ తామే అభ్యర్థులుగా భావించి కష్టపడి పనిచేశారు. ఈ దఫా ఎన్నికల్లో అన్ని స్థాయిల్లో అద్భుతమైన పనితీరు కనబరిచారు. క్షేత్రస్థాయిలో అందరూ గొప్పగా పనిచేశారు. బూత్‌ కన్వీనర్లు, ఏరియా కన్వీనర్లు పార్టీకి అండగా నిలబడ్డారు. అన్ని సర్వేలు, విశ్లేషణల్లో తెదేపాకే ఆధిక్యత వచ్చింది. రాష్ట్రంలో కేవలం ఒక్క మహిళల సంక్షేమానికే రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల సంక్షేమానికి మరో రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టాం. రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశాం. పెట్టుబడి సాయం కింద మరో రూ.14 వేల కోట్లు మంజూరు చేశాం’ అని చంద్రబాబు వివరించారు.