HomeTelugu Big Storiesనాపై ఒక్కటే.. జగన్‌పై 31 కేసులు ఉన్నాయి : చంద్రబాబు

నాపై ఒక్కటే.. జగన్‌పై 31 కేసులు ఉన్నాయి : చంద్రబాబు

7 31టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని పునరుద్ఘాటించారు. కోటి మంది ఆడబిడ్డల సౌభాగ్యానికి పసుపు-కుంకుమ ఇస్తున్నానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబు మాట్లాడారు. డ్వాక్రా సంఘాలను ఒకప్పుడు ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారన్నారు. మహిళలకు చెక్కులివ్వడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని.. వాళ్లు చెల్లని కాసులుగా మారారని సీఎం ఎద్దేవా చేశారు. పెద్దకొడుకుగా ఉంటానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్నారు. పింఛను పదిరెట్లు పెంచి రూ.2వేలు ఇస్తున్నామని.. తొందర్లోనే దాన్ని రూ.3వేలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కట్టెలపొయ్యి లేకుండా చేశామని.. త్వరలో ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీళ్లు వస్తాయని చెప్పారు.

ఆటోలు, ట్రాక్టర్లకు థర్డ్‌ పార్టీ బీమాను ప్రభుత్వమే చెల్లిస్తోందని చంద్రబాబు అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని.. పేదలకు రుణభారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించారు. రాష్ట్రమంతా టీడీపీ గాలి వీస్తోందని.. దాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. గుజరాత్‌కు తరలిపోతున్న కియా మోటార్స్‌ను మన రాష్ట్రానికి.. వెనుకబడిన అనంతపురం జిల్లాకు తీసుకొచ్చానన్నారు. అదీ తన శక్తి అని చెప్పారు. విశాఖకు తల లేని మొండెం మాదిరిగా జోన్‌ ఇచ్చారని ఆక్షేపించారు. దీంతో ఆదాయం రాయగడకు తరలిపోతుందన్నారు. ప్రత్యేకహోదా, పోలవరం నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా మోడీ మోసం చేశారని సీఎం దుయ్యబట్టారు. మోడీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. దేశానికి మోడీ, రాష్ట్రానికి తాను ఏం చేశామో చర్చకు సిద్ధమా అని మరోసారి సవాల్‌ విసిరారు.

ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈవీఎంలను తారుమారు చేయాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో పారదర్శకత రావాలంటే కనీసం 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలన్నారు. జగన్‌పై 31 కేసులు ఉన్నాయని ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని గుర్తు చేశారు. తనపై కేవలం ఒకే ఒక్క కేసు ఉందని.. అది కూడా ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని చేసిన పోరాటానికి మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఆ కేసు పెట్టిందన్నారు. జగన్‌తో నాకు పోరాటమా అన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాల్లో మంత్రి యనమల రామకృష్ణుడిది కీలక పాత్ర అని చెప్పారు. తనకు ఏదైనా కష్టం అనిపించినపుడు సలహా ఇచ్చే వ్యక్తి ఆయన అని కొనియాడారు. త్వరలోనే రూ.10వేల కోట్లతో బీసీ బ్యాంకు ప్రారంభిస్తామన్నారు. కాపుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!