అంబేద్కర్‌ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు: చంద్రబాబు

సంపద సృష్టితోనే పేదరికం పాలదోలడం సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే అంబేద్కర్‌ ఇచ్చిన స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసి పేదరికంలేని సమాజం కోసం కృషి చేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. పది రోజుల పాటు రోజుకో అంశంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై మూడో శ్వేత పత్రాన్ని మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రగతి గురించి వివరించారు.

‘పెద్ద ఎత్తున సంపద సృష్టించగలిగితే పేదరికాన్ని తొలగించొచ్చు. అంబేద్కర్‌ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. పేదరికలేని సమాజం కోసం కృషి చేస్తున్నాం. పేదరికం పోయేందుకు సంపదపై దృష్టి పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆదాయం పెంచే చర్యలు చేపట్టాం. పాదయాత్ర చేసేటప్పుడు రైతు కష్టాలు చూశా. అందుకే ఆర్థిక ఇబ్బందులున్నా.. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి ఒక్కో రైతుకు రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ.24 వేల కోట్లు రుణమాఫీ చేశాం. పౌష్ఠికాహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. కుటుంబ వికాసం, సమాజ వికాసం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.

రాష్ట్రంలో ప్రతి కుటుంబం నెలకు రూ.10వేలు ఆదాయం సంపాదించేలా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నాం. ఏ ప్రయోజనం కల్పించినా మహిళ పేరుతో అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. డ్వాక్రా సంఘాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. పేదరికంపై గెలుపు కార్యక్రమాన్ని తీసుకుని ఆర్థిక అసమానతలను తొలగిస్తున్నాం. ఆరోగ్యంపై ఖర్చు చేసే మొత్తాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. సంక్షేమ కార్యక్రమాలపై నిరంతర నిఘా కోసం గ్రామదర్శిని, గ్రామ వికాసం, జన్మభూమి వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. శుచి, శుభ్రతతో కూడిన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందిస్తున్నాం. రూ.5కే భోజనాన్ని ఇస్తున్నాం. 2014కు ముందు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి?.. ఇప్పుడు అమలౌతున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఓసారి బేరీజు వేసుకోవాలి. ఆదాయం లేని వారికి నిరంతరం అండగా నిలుస్తాం. పింఛన్లను పెంచే విషయమై ఆలోచిస్తాం’ అని సీఎం భరోసా ఇచ్చారు.