Homeతెలుగు Newsరెడ్‌అలర్ట్‌ ప్రకటించిన చంద్రబాబు.. అధికారులతో టెలికాన్ఫరెన్స్

రెడ్‌అలర్ట్‌ ప్రకటించిన చంద్రబాబు.. అధికారులతో టెలికాన్ఫరెన్స్

1 17ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెథాయ్‌ తుఫానును అత్యవసర పరిస్థితిగా భావించాలనిఅధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించి దానికి తగ్గట్లుగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. విపత్తును ఎదుర్కోవడంపై ప్రతిశాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. పెథాయ్‌ తుపాన్‌పై చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. విపత్తుల సమయంలో ఎవరూ సెలవులు పెట్టరాదని.. అందరూ విధులకు హాజరై అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాలని సీఎం స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో విపత్తులు కొత్త కాదని, భవిష్యత్తులోనూ తుఫాన్లు వస్తాయన్న ఆయన… అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుఫాన్ల కాలమేనని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

తుఫాను ప్రభావంతో ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు పడతాయన్న చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యలతో జన నష్టం, పశునష్టం నివారించాలని ఆదేశించారు. ప్రజల ఇబ్బందులను తగ్గించాలని సూచించారు. అన్నివర్గాల ప్రజల్లో ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. అన్ని వనరులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక అధికారి బాధ్యత తీసుకుని.. గ్రామంలో అందరినీ చైతన్యపరచాలని పేర్కొన్నారు. సహాయ చర్యల్లో ‘ఆపద మిత్ర’లు భాగస్వాములు కావాలని సూచించారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. అల్పాహారం, భోజనం, తాగునీరు అందించాలని.. పాలు, కూరగాయలతో సహా నిత్యావసరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ సాయంత్రానికే తాను విశాఖకు చేరుకుంటానని.. మంత్రులు అందరూ మధ్యాహ్నానికే మండలాలకు చేరాలని ఆదేశించారు. సహాయ చర్యలలో పార్టీ నేతలు,కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సహాయ పునరావాస చర్యలు మనందరి బాధ్యతని, కేవలం ప్రభుత్వమే కాకుండా, అన్నివర్గాల ప్రజలు చేయూత అందించాలని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!