HomeTelugu Newsకాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అరెస్ట్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అరెస్ట్‌

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. దాదాపు గంట హైడ్రామా అనంతరం ఈ అరెస్ట్‌ చోటుచేసుకుంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనను అరెస్ట్‌ చేసేందుకు ఆయన ఇంటికొచ్చిన సీబీఐ, ఈడీ అధికారులను వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా నడిచింది. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

గత కొద్దిరోజులుగా ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందస్తు బెయిల్‌ కోసం చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. దీంతో మంగళవారమే చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అయితే అక్కడ లేకపోవడంతో సీబీఐ బృందం వెనుదిరిగింది. మరోవైపు హైకోర్టు ముందస్తు బెయిల్‌కు నిరాకరించిన నేపథ్యంలో చిదంబరం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు నిరాశ తప్పలేదు. ఊహించని విధంగా బుధవారం రాత్రి కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రత్యక్షమై మీడియాతో మాట్లాడారు. తాను ఏ నేరమూ చేయలేదని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనంత మాత్రాన నేరస్తుడిగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పారు.

మీడియా సమావేశం అనంతరం జోర్‌బాగ్‌లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ కూడా వెళ్లారు. ఆ తర్వాత అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. సీబీఐ, ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా.. చిదంబరం వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సీబీఐ అధికారులు గోడదూకి లోపలికి ప్రవేశించారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu