
Kannappa Brahmin Controversy:
జూన్ 27న విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన భారీ బడ్జెట్ చిత్రం “కన్నప్ప” అప్పుడే మంచి బజ్ తెచ్చుకుంది. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్, ప్రభాస్ వంటి స్టార్ కాస్ట్ ఉండడంతో మూవీపై అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. కానీ తాజాగా బ్రాహ్మణ సంఘాల నుండి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి.
బ్రహ్మానందం, సప్తగిరి పోషిస్తున్న పిలక-గిలక పాత్రలు బ్రాహ్మణులను తక్కువగా చూపిస్తున్నాయంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన రైటర్ అకెళ్ల శివ ప్రసాద్, తాను కూడా బ్రాహ్మణుడేనని, అలాగే దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ కూడా నార్త్ ఇండియాకు చెందిన బ్రాహ్మణుడేనని తెలిపారు.
“ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా బ్రాహ్మణుల్ని అవమానించేలా లేదు. అంతేకాక, మోహన్ బాబు పోషించిన మహాదేవ శాస్త్రి పాత్రను భక్తి భావంతో, గౌరవంగా చూపించాం. ఇది 16వ శతాబ్దపు శ్రీకాలహస్తి మహత్యం కావ్యంలో ఆధారపడిన పాత్ర” అని వివరించారు.
ఇంకా, ఈ సినిమా విడుదలకు ముందు శ్రీకాలహస్తి ఆలయ ప్రధాన పూజారులకు ప్రీ-స్క్రీనింగ్ చేసిన విషయాన్ని పేర్కొన్నారు. వారు సినిమా చూసి మెచ్చుకుని ఆశీర్వాదాలు కూడా ఇచ్చారని అన్నారు. రామజోగయ్య శాస్త్రి లాంటి పలువురు బ్రాహ్మణులు ఈ చిత్రంలో పని చేశారని చెప్పారు.
“ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, సంవత్సరాల పాటు కష్టపడి ఒక సినిమా తీసి, ఏవైనా వర్గాల్ని బాధించే ఉద్దేశం ఎవరికీ ఉండదు. ప్రచారం జరుగుతున్న రూమర్స్ అసంబద్ధమైనవి. అసలైన అర్థం సినిమా చూస్తే తెలుస్తుంది” అని సమాధానం ఇచ్చారు.
కనిపిస్తున్న ఈ వివాదం త్వరలో క్లియర్ అవుతుందని, జూన్ 27న ప్రేక్షకుల ముందు సినిమా నిజమైన శ్రద్ధను చూపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మూవీ యూనిట్.