ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. గత ఎన్నికల సమయంలో ఆయన్ను ప్రత్యర్థులు ‘చాయ్‌వాలా’గా వెక్కిరించడంతో ‘చాయ్‌పే చర్చా’ పేరిట ప్రచారం చేశారు. దీనికి అప్పట్లో విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు అటువంటి ప్రచారానికే మోడీ తెర తీశారు. మోడీని ప్రతిపక్షాలు తరచూ చౌకీదార్ పేరుతో ఎద్దేవా చేస్తుండటంతో ఆయన ‘మై భీ చౌకీదార్’ పేరుతో ఉద్యమం ప్రారంభించారు. దేశంలోని అవినీతి, సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు తన మాదిరిగానే ఎందరో పోరాడుతున్నారని, ఈ లక్ష్య సాధనలో తాను ఒంటరివాడిని కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ‘నేనూ కాపలాదారునే’ అంటూ ప్రతిజ్ఞ చేయాలని తన మద్దతుదారులకు మోడీ ట్విటర్ ద్వారా పిలుపునిచ్చారు. తాజాగా ఆయన వ్యక్తిగత ట్విటర్ ఖాతా పేరును సప్రధాని నరేంద్ర మోడీ నుంచి కాపలాదారు నరేంద్ర మోడీ (చౌకీదార్ నరేంద్ర మోడీ)గా మార్చుకొన్నారు. ఇది జరిగిన వెంటనే ఆయన్ను అనుసరిస్తున్న బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కూడా తమ ట్విటర్ ఖతాల పేర్లకు ముందు ‘కాపలాదారు’ అనే పదాన్ని చేర్చుకొన్నారు. ‘కాపలాదారు అమిత్‌షా’, ‘కాపలాదారు పీయూష్ గోయల్’ గా ఇప్పటికే మార్చుకొన్నారు. కేంద్ర మంత్రి నడ్డా కూడా ఈజాబితాలో చేరారు. ‘మై భీ చౌకీదార్’ పేరుతో ట్విటర్‌లో ఇప్పటికే ఒక హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు.
సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని శనివారం ఆయన ‘నేనూ కాపలాదారునే’ అనే బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘మీ కాపలాదారు చాలా దృఢంగా నిలబడి దేశానికి సేవ చేస్తున్నారు. ఈ కృషిలో నేను ఒంటరిగా లేను. అవినీతి, సామాజిక రుగ్మతలు, అపరిశుభ్రతపై పోరు సల్పే ప్రతిఒక్కరూ కాపలాదారులే. దేశ ప్రగతి కోసం శ్రమించే వారందరూ చౌకీదారులే. నేడు దేశంలో ప్రతి ఒక్కరూ ‘నేనూ కాపలాదారునే’ అని నినదిస్తున్నారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందేశానికి మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోను జత చేశారు.













