HomeTelugu Newsఅప్పట్లో చినజీయర్‌కు డ్రైవర్‌గా మారా:కేసీఆర్‌

అప్పట్లో చినజీయర్‌కు డ్రైవర్‌గా మారా:కేసీఆర్‌

13 6ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. చినజీయర్‌ స్వామితో తనకు ఏర్పడిన పరిచయం సహా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందన్నారు. ఫిబ్రవరిలో ప్రధాన ఆలయాన్ని ప్రారంభించాలని చినజీయర్‌ స్వామి చెప్పారని తెలిపారు. యాదాద్రిలో 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రపంచ వైష్ణవ పీఠాల నుంచి స్వాములను పిలిపించాలని సంకల్పించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

తనది బాల్య వివాహమనీ.. 14వ ఏటే వరంగల్‌ జిల్లా చిత్తలూరులో తన వివాహం జరిగిందని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో గురువులు వస్తే తమందరికీ పండుగలా ఉండేదనీ.. వారొస్తే నెల రోజుల వరకు గ్రామంలోనే ఉండేవారని చెప్పారు. తమ ఇంట్లో అతిథులుగా ఉంటూ గ్రామస్థులందరికీ భారతం, భాగవతం బోధించేవారన్నారు. వారే తమను సంస్కారవంతంగా తీర్చిదిద్దారని చెప్పారు. అప్పటినుంచే తమలో ఆ భక్తి, ఆ పరంపర కొనసాగుతోందని సీఎం వివరించారు. భక్తిభావన ఉన్నప్పటికీ అది పరిపుష్టంగా జరగాలంటే దానికెక్కడో ఒకచోట ప్రజ్వలనం జరగాల్సి ఉంటుందన్నారు.

తనకు అంతకుముందెప్పుడూ చినజీయర్‌స్వామితో పరిచయం లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 1986 – 87లో సిద్ధిపేటలో బ్రహ్మయజ్ఞం తలపెట్టారనీ.. ఈ క్రమంలో భక్తులు, వికాస తరంగిణి మిత్రులంతా తన వద్దకు వచ్చి ఇదో మంచి కార్యక్రమం, మనం తప్పకుండా చేయాలంటూ తనవద్దకు వచ్చారని సీఎం గుర్తు చేసుకున్నారు. దీనికి తానూ సరే అనడంతో పనులు ప్రారంభించామన్నారు. తమ గ్రామంలో అప్పుడు బ్రాహ్మణ పరిషత్‌ లేదనీ.. స్వామీజీ ఉండేందుకు సరైన చోటు కూడా లేకపోవడంతో గ్రామస్థులు వచ్చి చినజీయర్‌ను తన ఇంట్లోనే ఉంచాలని చెప్పారన్నారు. అంతకన్నా అదృష్టం ఏముంటుందనే ఉద్దేశంతో చినజీయర్‌ స్వామిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహించారని సీఎం వివరించారు. ఆ ఏడు రోజులూ ఆయన తమ ఇంట్లోనే బస చేశారని వెల్లడించారు. ఆ సమయంలో తాను స్వామీజీకి కారు డ్రైవర్‌గా మారిపోవడం.. పలు ఆలయాలకు తిరగడం జరిగిందని తెలిపారు. ఆ ఏడెనిమిది రోజులు తానే కారును డ్రైవ్‌ చేయడంతో ఆయనతో పాటే ఉండటంతో స్వామీజీ చేసిన అనుగ్రహ భాషణలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. భగవద్‌ రామానుజాచార్య విగ్రహం హైదరాబాద్‌లో వెలవడం చాలా గర్వకారణమని కేసీఆర్‌ అన్నారు. ఆ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకుందామని చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో తానూ ఓ సేవకుడిలా పాల్గొంటానన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu