HomeTelugu TrendingAlluri Sitaramaraju: మన్యం వీరుడుకి 50 ఏళ్లు!

Alluri Sitaramaraju: మన్యం వీరుడుకి 50 ఏళ్లు!

Alluri Sitaramaraju

Alluri Sitaramaraju: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన్న ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం.

కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయని అంటుంటారు.. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకి అది చేరాల్సిన వారికే అది దక్కుతుంది. అలాంటి ఈ పాత్ర అంతమంది ప్రయత్నించినా కృష్ణకే కుదిరింది! – మొదట అక్కినేని నాగేశ్వరరావు అల్లూరి సీతరామరాజు చేయాలని ప్రయత్నించారు. తాతినేని ప్రకాశరావుతో కలిసి ప్రయత్నాలు చేశారు. కుదరలేదు. తర్వాత ఎన్టీఆర్‌ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు రెడి చేయించారు. అది ఫలించలేదు.

దేవదాసు నిర్మాత డి.ఎల్‌. కూడా శోభన్‌బాబుతో చేయాలని అనుకున్న అది కూడా కుదరలేదు. అప్పుడే త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రాయించి ఈ సినిమా చేశారు కృష్ణ. అంతవరకూ కృష్ణ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తైతే, అల్లూరి సీతారామరాజు మరో ఎత్తనే చెప్పాలి. సంభాషణలు చెప్పే తీరు, హావభావాలు ప్రదర్శించే తీరు, ఆహార్యం వంటి విషయాల్లో కృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ఈ సినిమా చేశారు.

1973 డిసెంబరు 12న ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. పద్మాలయా సంస్థ ఆస్థాన ఛాయాగ్రాహకుడైన వి.ఎస్‌.ఆర్‌.స్వామి స్కోప్‌లో సినిమా చేయాలని సలహా ఇచ్చారు. వెంటనే కృష్ణ ముంబయి నుంచి సంబంధిత లెన్సులు తెప్పించి షూటింగ్ చేశారు. కొండలు, కోనల మధ్య ఈ సినిమా షూటింగ్‌ చేశారు. చింతపల్లికి దగ్గరలో ఉన్న లోతుగడ్డ, లంబసింగి, సప్పర్ల, అన్నవరం, పోశనపాడు, బలిమెల మన్యం, కృష్ణదేవిపేట ప్రాంతాల్లో నిర్విరామంగా దాదాపు రెండు నెలలపాటు చిత్రీకరణ చేశారు.

ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల మంచి నీళ్ల కోసం కూడా చాలా దూరం వెళ్లాల్సి వచ్చేదట. అంతటి కష్టంలోనూ సినిమా తీసి జయప్రదం చేశారు. సెట్స్‌లోనే మహారథి సంభాషణలు రాసేవారట. మన్యంలో షూటింగ్‌ జరిగిన రోజులన్నీ మహారథి ఒకపూట మాత్రమే భోజనం చేసేవారట. క్లైమాక్స్ సీన్స్​కు అవసరమైన డైలాగ్స్​ రాసేందుకు ఒక రోజు మొత్తం అందరికీ దూరంగా వెళ్లి రాశారట మహారథి.

అల్లూరి సీతరామరాజుకు వి.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. అయితే రామచంద్రరావు కృష్ణ నటించిన మూడో చిత్రం గూఢచారి 116 చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్​గా పని చేశారు. అనంతరం కృష్ణ నటించిన అసాధ్యుడు చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత నేనంటే నేనే, కర్పూర హారతి, అఖండుడు, అల్లూరి సీతారామరాజు, ఆస్తులు- అంతస్తులు వంటి కృష్ణ నటించిన 13 సూపర్ హిట్​ చిత్రాలకు రామచంద్రరావు దర్శకత్వం వహించారు.

అయితే అల్లూరి షూటింగ్ చివరి దశలో రామచంద్రరావు (47) కన్నుమూశారు. దీంతో కృష్ణనే దర్శకత్వ బాధ్యతలు తీసుకోమని మహారథి అడిగారు. కానీ దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌. దాసుకు ఆ పనులు అప్పగించి కృష్ణ హిట్ కొట్టారు. ఈ చిత్రం 17 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. విజయవాడలో ఏకంగా నాలుగు థియేటర్లలో ఒకేరోజు విడుదలై సూపర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా చూసి సీనియర్ ఎన్టీఆర్‌ కృష్ణను అభినందించారు. తాను చేయాలనుకున్న అల్లూరి విరమించుకున్నారు.

ఈ సినిమాలో రూథర్‌ఫర్డ్‌గా జగ్గయ్య నటించారు. నీలిరంగు కాంటాక్ట్‌ లెన్సులను అమర్చి మరీ బ్రిటిషు దొర రూపాన్ని తీర్చిదిద్దారు మేకర్స్​. అగ్గిరాజు పాత్రకు మొదట ఎస్వీఆర్‌ను అనుకున్నారు. కానీ ఆ తర్వాత బాలయ్యను వరించిందా పాత్ర. ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా సాంగ్​కు ఉత్తమ గీత రచన పురస్కారం దక్కింది. తెలుగు సినిమాకు ఈ అవార్డు రావడం అదే తొలిసారి. సినిమాకు స్వర్ణ నంది కూడా వరించింది. ఈ చిత్రాన్ని హిందీలో ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ పేరుతో డబ్‌ చేశారు. ఈ మూవీ స్వర్ణోత్సవం సమయంలో సీతారామరాజు తమ్ముడు సత్యనారాయణరాజును కృష్ణ సత్కరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu