అరుదైన ఘనత సాధించిన మహిళా క్రికెటర్


భారత మహిళల క్రికెట్‌పై వంద పేజీల పుస్తకం రాస్తే 80 వరకు ఆమె గురించే రాయల్సి ఉంటుంది. క్రికెటర్‌గా ఆమె ప్రస్థానం మహిళల క్రికెట్‌ పురోగ‌మ‌నం సమాంతరంగా సాగుతాయి. ఆమె మరెవరో కాదు మిథాలీరాజ్‌. చిన్న వయసులోనే ఆటలో అరంగేట్రం చేసి ఎవరికీ సాధ్యం కాని ఘనతలు అందుకుంది. తాజాగా మరే క్రికెటర్‌ సాధించని ఓ రికార్డు సృష్టించింది.

మహిళల క్రికెట్‌లో సాధారణంగా 100 లేదా 120 మ్యాచులు ఆడితే మహా ఎక్కువ! అలాంటి మిథాలీ రాజ్‌ ఏకంగా 200వ వన్డే ఆడేసింది. మహిళల క్రికెట్‌ ప్రపంచ చరిత్రలో ఈ ఘనత సాధించింది కేవలం ఆమె ఒక్కరే. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ ఆమెకు 200వ వన్డే. 36 ఏళ్ల మిథాలీ 51.33 సగటుతో 6622 పరుగులు చేసింది. 19 ఏళ్లకే వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. చిరస్మరణీయ వన్డేలో మాత్రం భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. 28 బంతుల్లో 9 పరుగులే చేసింది. ఇంకో విషయం ఏంటంటే భారత్‌ ఇప్పటి వరకు 263 వన్డేలు ఆడితే అందులో 200 మ్యాచుల్లో మిథాలీ ప్రాతినిథ్యం వహించింది. 200వ మ్యాచ్‌ సందర్భంగా బీసీసీఐ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆమెను అభినందించారు.