స్విట్జర్లాండ్‌ శ్రీదేవి విగ్రహం

దివంగత నటి శ్రీదేవి నటించి సూపర్‌ హిట్‌ మూవీగా నిలిచిన ‘చాందిని’ మూవీని స్విట్జర్లాండ్‌ సుందర ప్రదేశాల్లో తెరకెక్కించారు. ఈ చిత్రం లో శ్రీదేవి, రిషి కపూర్‌ జంటగా నటించారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి జ్ఞాపకార్థంగా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. 2016లో భారత సినీ దిగ్గజం యష్‌ చోప్రా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. తాజాగా శ్రీదేవి విగ్రహాన్ని తమ దేశంలో నెలకొల్పాలని స్విట్జర్లాండ్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాష్‌ చోప్రా సినిమాల్లో అత్యధిక సినిమాలు స్విట్జర్లాండ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లోనే తెరకెక్కాయని, వీటి కారణంగా స్విట్జర్లాండ్‌కు భారత టూరిస్టులు పెరిగారని స్విస్‌ అధికారులు చెబుతున్నారు.

ఇక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించిన క్రమంలో శ్రీదేవి పాత్రను పరిగణనలోకి తీసుకుని ఆమె విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. స్విట్జర్లాండ్‌లో షూటింగ్‌ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా1964లో రాజ్‌కపూర్‌ మూవీ సంగం నిలిచింది. నాలుగు దశాబ్ధాల పాటు తన అందంతో వెండితెరను వెలిగించిన శ్రీదేవి ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే.