మరోసారి ఏడడగులేసిన ‘దీప్‌వీర్‌’ వీడియో వైరల్‌!

బాలీవుడ్‌ నటులు దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ మరోసారి ఏడడుగులేశారు. గతేడాది ఇటలీలోని లేక్‌ కోమోలో ‘దీప్‌వీర్‌’ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి కేవలం సంజయ్‌ లీలా భన్సాలీ, ఫరా ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ను మాత్రమే పిలిచారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇతర సెలబ్రిటీలు ఎవ్వరూ పెళ్లికి హాజరుకాలేదు. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి ముంబయిలో ఓ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. వేడుకకు దీప్‌వీర్‌ కూడా హాజరయ్యారు. ఈ షోకు బాలీవుడ్‌ యువ నటులు విక్కీ కౌశల్‌, కార్తిక్‌ ఆర్యన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వేడుకలో దీపిక, రణ్‌వీర్‌లు అవార్డులు అందుకోవడానికి స్టేజ్‌పైకి వెళ్లారు. ఈ నేపథ్యంలో పెళ్లికి తమను పిలవలేదని, వేడుక ఎలా జరిగిందో తాము చూడలేదు కాబట్టి మరోసారి తమ అందరి ముందు ఏడడుగులు వేయాల్సిందేనని విక్కీ, కార్తిక్‌ పట్టుబట్టారు. ఇందుకు దీప్‌వీర్‌ కూడా ఒప్పుకొన్నారు. అంతేకాదు విక్కీ పురోహితుడిగా నేలపై కూర్చుని నోటికొచ్చిన మంత్రాలు చదువుతుంటే.. దీపిక వేసుకున్న డ్రెస్‌ను పట్టుకుని రణ్‌వీర్‌ ఏడడుగులు వేయడం నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.