Homeతెలుగు Newsఅందుకే బీజేపీలో చేరాను: డీకే అరుణ

అందుకే బీజేపీలో చేరాను: డీకే అరుణ

15 3ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అలాంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో మంగళవారం రాత్రి ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీనియర్‌ నేత మురళీధర్‌రావు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో పూర్తిగా క్షీణించిపోతోందని.. అందుకు కాంగ్రెస్‌ ముఖ్య నేతల వ్యవహారశైలే కారణమని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌తో లాలూచీ పడి కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా నాశనం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీకే అవకాశం ఉందన్నారు. దేశ ప్రజలకు రక్షణ కల్పించే శక్తి కేవలం మోడీ నాయకత్వంలోని బీజేపీకే ఉందని భావించి.. తాను బీజేపీలో చేరినట్టు స్పష్టంచేశారు. తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీను గెలిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

డీకే అరుణ చేరికతో బీజేపీకు బలం చేకూరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాలకు విసిగి డీకే అరుణ బీజేపీలో చేరారని వివరించారు. కేంద్రం మెడలు వంచుతామని కేసీఆర్‌ అంటున్నారని.. కేంద్రంలో చక్రం తిప్పడం కాదు బొంగరం కూడా తిప్పలేరని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఆటలను కట్టడి చేయడానికి అరుణలాంటి వారు బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. అలాగే, ఇంటిపార్టీ నేత యన్నం శ్రీనివాస్‌ రెడ్డి కూడా బీజేపీలో చేరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu