‘దొరసాని’ మూవీ రివ్యూ

movie-poster
Release Date
July 12, 2019

హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, హీరో రాజశేఖర్-జీవితల కూతురు శివాత్మిక హీరోయిన్‌గా ‘దొరసాని’ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రంతో హీరో, హీరోయిన్ ఇద్దరికీ తొలి సినిమా. 40 ఏళ్లు వెనక్కి వెళ్లి గడీలు, దొరల కాలం నేపధ్యంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్తో అంచనాలను మరింత పెంచేసింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది దొరసాని చిత్రం.. ఆనంద్‌, శివాత్మికలకు ఈ చిత్రం మంచి గుర్తింపు నిస్తుందా? తొలి సినిమాతోనే ఈ జంట విజయం సాధించారా.. మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకుంటారా.. రివ్యూలో చూద్దాం.

కథ: తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో సాగే ప్రేమకథ ఇది. అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో దొరల రాజ్యం ఉండేది. పట్టణంలో చదువుకుని వచ్చిన రాజు (ఆనంద్‌ దేవరకొండ) దొరసాని దేవకి(శివాత్మిక)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఓ ఊరి దొర రాజారెడ్డి (వినయ్‌ వర్మ) కూతురు దొరసాని దేవకి. రాజు కవిత్వానికి దేవకి కూడా ప్రేమలో పడిపోతుంది. ప్రతి ప్రేమకథలాగానే ఈ ప్రేమకూ పెద్దలు అడ్డుతగులుతారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన దొర ఏం చేశాడు? ఈ ప్రేమ జంట ఎలా ఎదుర్కొంది? చివరికి రాజు, దేవకిల కథ ఎలా ముగిసింది? అనేదే దొరసాని చిత్రం మిగతా కథ.

నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ తొలి చిత్రంలోనే చాలా బరువైన పాత్రను సమర్థంగా పోషించాడు. ఎక్కడా తడబాటు పడలేదు. తెలంగాణ యాసలో ఆనంద్ చెప్పే డైలాగులకు విజయ్‌దేవర కొండ గుర్తుకొస్తాడు. తన గొంతు కూడా విజయ్‌ దేవరకొండ గొంతును పోలి ఉంటుంది. లుక్స్‌ పరంగానూ అక్కడక్కడా విజయ్‌లా కనిపిస్తాడు. దేవకి పాత్రకు శివాత్మిక వందశాతం న్యాయం చేసింది. డైలాగ్స్ తక్కువే అయినా లుక్స్‌ పరంగా ఆకట్టుకుంది. దొరసానిగా హావభావాలతోనే నటించి మెప్పించింది. చిత్రం మొత్తం వీరి భుజాలపైనే మోసారనిపిస్తుంది. ఇద్దరికీ మంచి గుర్తింపు వస్తుంది. దాదాపు 60మంది కొత్త వాళ్లు ఈ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. దొర పాత్రలో వినయ్‌ వర్మ, నక్సలైట్‌గా కిషోర్‌, రాజు స్నేహితులు తమ పరిధి మేరకు న్యాయం చేశారు.

విశ్లేషణ: ధనవంతుల అమ్మాయి, పేదింటి అబ్బాయి మధ్య ఇప్పటి వరకు ఎన్నో కథలు వచ్చాయి. ఈ కథ కూడా అలాంటిదే. తెలంగాణ నేపథ్యంగా కథను నడిపించడం ఈ సినిమాలో కొత్తదనం. 40 ఏళ్ల కిందట తెలంగాణలోని పరిస్థితులు.. అప్పట్లో దొరల పాలనలో నలిగిపోతున్న ప్రజల జీవితాలు.. పెరిగిపోతున్న నక్సలిజం ప్రభావం.. ఇలాంటి పరిస్థితుల మధ్య చిగురించిన ప్రేమకథ దొరసాని. కథను వాస్తవ పరిస్థితులకు దగ్గరగా తీయాలని దర్శకుడు ప్రయత్నించారు. ఈ చిత్రాన్ని కమర్షియల్‌ బాట పట్టించకుండా తాను నమ్మిన సిద్దాంతానికే కట్టుబడి దొరసాని చిత్రాన్ని ఓ కళాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ప్రతి పాత్రనూ, ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

తెలంగాణలోని మారుమూల పల్లెల్లో షూటింగ్‌ చేయడం వల్ల అప్పటి వాతావరణం చక్కగా చూపించగలిగాడు. ఎక్కడా బోర్‌ కొట్టించకపోయినా.. తరువాతి సీన్ ఏమిటన్నది ప్రేక్షకుడికి ఇట్టే తెలిసిపోతుంది. నిదానంగా సాగడం వలన ప్రేక్షకులు కొంత అసహనానికి ఫీలయ్యే అవకాశం ఉంది. కథ ఒకే చోట తిరుగుతుండటం ప్రేక్షకులకు కాస్త విసుగనిపిస్తుంది. నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు అదనపు బలం. ఇటీవల జరిగిన కొన్ని పరువు హత్యలను దర్శకుడు ప్రేరణగా తీసుకున్నాడేమో పెద్దలు చిన్నవాళ్ల ప్రేమను అర్ధం చేసుకోవాలని, ఆశీర్వదించాలనే తన మనోభావాన్ని ఈ చిత్రం ద్వారా చూపించాడు.

హైలైట్స్‌ :
హీరో, హీరోయిన్ నటన
నేపథ్య సంగీతం, పాటలు, ద్వితీయార్ధం

డ్రాబ్యాక్స్ :
కథలో కొత్తదనం లేకపోవడం
ప్రేక్షకుడు ఊహించేలా సాగే కథనం

టైటిల్ : దొరసాని
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, వినయ్‌ వర్మ, కిషోర్‌ తదితరులు
సంగీతం : ప్రశాంత్ విహారి
దర్శకత్వం : కె.వీ.ఆర్ మహేంద్ర
నిర్మాత : మధుర శ్రీధర్, యష్ రంగినేని

చివరిగా : దొరసాని అలనాటి పేద-గొప్పల ప్రేమ కథ
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Critics METER

Average Critics Rating: 3
Total Critics:1

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

దొరసాని అలనాటి పేద-గొప్పల ప్రేమ కథ
Rating: 2.5/5

https://www.klapboardpost.com