అమితాబ్‌ సార్‌.. త్వరలో మీ నిజాలు బయటపడతాయి..!

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్‌ సప్నా భవ్నానీ. ఇటీవల ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో భాగంగా బిగ్‌బిని ‘మీటూ’ ఉద్యమం గురించి స్పందించాల్సిందిగా కోరారు. ఇందుకు బిగ్‌బి స్పందిస్తూ..’ఏ మహిళ కూడా ఎక్కడా లైంగిక వేధింపులు ఎదుర్కోకూడదు. ముఖ్యంగా ఆమె పనిచేసే వాతావరణంలో. అలాంటివి ఎదురైనప్పుడు సదరు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మన సమాజంలో మహిళలు, పిల్లల పట్ల ఇప్పటికీ బలహీనులనే ముద్ర ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి. మన దేశంలో పని చేసే ప్రదేశాల్లోనే మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇది మనసును కలచివేస్తోంది. వారికి దక్కాల్సిన గౌరవం, రక్షణ ఇవ్వకపోతే మన దేశంపై చెరిపేసుకోలేని మచ్చ పడుతుంది’ అన్నారు.

బిగ్‌బి సమాధానంపై సప్నా స్పందిస్తూ.. ‘ఇది అతిపెద్ద అబద్ధం. సర్‌..మీరు నటించిన ‘పింక్‌’ సినిమా వచ్చింది. వెళ్లిపోయింది. అదే విధంగా మీకున్న సామాజికవేత్త అనే బిరుదు కూడా పోతుంది. త్వరలో మీ నిజాలు బయటపడతాయి. నా ట్వీట్‌ చదివి మీరు కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే కొరుక్కోవడానికి మీకున్న గోళ్లు సరిపోవు’ అని ట్వీట్‌ చేశారు. దాంతో ఈ ట్వీట్‌ కాస్తా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమితాబ్‌ గురించి ఏ నిజం బయటపడుతంది? అసలేం జరిగింది? అంటూ నెటిజన్లు సప్నాకు మెసేజ్‌లు పెడుతున్నారు.