మోడీ నాలా ఎప్పుడైనా ముందుకువచ్చారా?: రాహుల్‌ గాంథీ

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటిస్తున్న ఆయన.. స్టెల్లా మేరీ కళాశాలలో విద్యార్థినులతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీతో మాట్లాడి, ఆయనను ప్రశ్నించే అవకాశం మీలో ఎంతమందికి వచ్చింది? విద్యా రంగం గురించి ఆయన ప్రణాళికలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మీలో ఎవరైనా అడిగారా? అలాగే, ఇతర విషయాల గురించి ఆయనను ప్రశ్నించే అవకాశం మీలో ఎవరికైనా వచ్చిందా? 3,000 మంది మహిళల మధ్య ఇలా నాలా నిలబడి మోడీ మాట్లాడుతుండగా మీరు ఎప్పుడైనా చూశారా? ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి ఆయన నాలా ఎప్పుడైనా ముందుకువచ్చారా?’ అని ప్రశ్నించారు.

‘దేశంలో ఓ రకమైన భావజాలం ప్రచారం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ దీనికి ప్రతినిధులుగా ఉన్నారు. వారి భావజాలాన్నే దేశం మొత్తం పాటించాలని అనుకుంటున్నారు. మరోవైపు మరో మంచి భావజాలం ఉంది. ఈ భావజాలం దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని చెబుతోంది. దీనిపై ఆ మొదటి రకం భావజాలం ఆదిపత్యం చెలాయించకుండా చూడాలి. దేశంలో భయానక వాతావరణం ఉండకూడదు. దేశ ఆర్థికాభివృద్ధి విషయంలో భయం ఉండకూడదు. ఈ అంశాలు దేశ ప్రజలు ఎలా ఉన్నారన్న విషయాలను తెలుపుతాయి’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

‘కాంగ్రెస్‌ దేశ ప్రజల పరిస్థితులను మార్చుతుంది. ప్రజలంతా సంతోషంగా, సాధికారతతో జీవించేలా చేస్తుంది. నా తల్లి నాకు ప్రేమ, మానవత్వాలను నేర్పింది. చట్టం ప్రతి ఒక్కరికీ వర్తించాలి. అది వాద్రా అయినా సరే.. ప్రధాని అయినా సరే. అంతేగానీ, ఎవరిపై ప్రయోగిస్తే వారిపై కాదు. రఫేల్‌ ఒప్పందాన్ని ప్రధాని మోడీ.. విమానాల తయారీలో ఎటువంటి అనుభవం లేని ఓ పారిశ్రామిక వేత్తకు అప్పగించారు. దీనిపై మోడీ మౌనం వహిస్తున్నారు’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక రంగానికి నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.