‘కబీర్‌ సింగ్‌’పై ప్రభాస్‌ రియాక్షన్‌.. ఒరిజినల్‌ కంటే..

టాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘అర్జున్‌ రెడ్డి’ ని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ అనే టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్‌ కపూర్‌, కియారా అద్వాణీ జంటగా నటిస్తున్నారు. మాతృకను తీసిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దీన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రీమేక్‌ టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు స్క్రిప్టులో ఎటువంటి మార్పులు చేయకుండా హిందీ చిత్రాన్ని తీసినట్లు టీజర్‌ను బట్టి తెలిసింది. షాహిద్‌ తన పాత్రలో ఒదిగిపోయారని విమర్శకులతోపాటు ప్రముఖులు ప్రశంసించారు.కాగా ఈ టీజర్‌ను ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌ చూశారట. ఈ విషయాన్ని ఆయన హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీమ్‌ హకీమ్‌ చెప్పారు. ప్రభాస్‌ ఫోన్‌లో దాదాపు ఏడు నిమిషాలు షాహిద్‌తో మాట్లాడారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ‘సాహో’ సినిమా షూటింగ్‌ కోసం నేను ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నా. ‘కబీర్‌ సింగ్’ టీజర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ప్రభాస్‌ దాన్ని చూసి.. నచ్చిందని చెప్పారు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను ఎంజాయ్‌ చేసిన ప్రభాస్‌ టీం మెంబర్స్‌ కూడా షాహిద్‌ నటనను మెచ్చుకున్నారు. టీజర్‌ చూసిన తర్వాత ప్రభాస్‌ రియాక్షన్‌ చూసి.. నేను షాహిద్‌కు ఫోన్‌ చేసి, ఆయన చేతిలో పెట్టా. ప్రభాస్‌ షాహిద్‌ను ప్రశంసించారు. ఒరిజినల్‌ కంటే ‘కబీర్‌ సింగ్‌’ ఇంకా ఉత్తమంగా ఉందని అన్నారు. దాదాపు ఏడు నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్నారు’ అని తెలిపారు.’కబీర్‌ సింగ్‌’ టీజర్‌ చూసిన తర్వాత రియల్‌ ‘అర్జున్‌ రెడ్డి’ విజయ్ దేవరకొండ కూడా ట్విటర్‌లో స్పందించారు. షాహిద్‌కు, మిగిలిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘నా ప్రేమను పంపుతున్నా’ అని పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates