HomeTelugu Newsరైతుల డబ్బులు ఆపడం దురదృష్టకరం:పవన్ కల్యాణ్

రైతుల డబ్బులు ఆపడం దురదృష్టకరం:పవన్ కల్యాణ్

 

101

రైతుల సమస్యలు, పరిష్కార అంశాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకుండా ఏపీ వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవన్‌ విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి డబ్బును చెల్లించడంలో జాప్యం చేయడం దురదృష్టకరమని అన్నారు. వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. కొందరు రైతు ప్రతినిధులు తనను
కలిసినప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బాకీలు, విత్తనాల కోసం పడుతున్న బాధలను వివరించారని తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాలను తక్షణమే విడుదల చేసి, తగినన్ని విత్తనాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

ధాన్యం కొనుగోలు కింద రైతులకు ఇప్పటివరకు రూ.610 కోట్లు చెల్లించాల్సి ఉందని పవన్‌ తెలిపారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.240 కోట్లు ఉండగా.. తూర్పుగోదావరి జిల్లాలో రూ.176 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.94 కోట్లు ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రైతులు సైతం విత్తనాల కొరతతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విత్తనాల కోసం అర్ధరాత్రి వరకూ క్యూలో నిలబడినా దొరుకుతాయో లేదో అనే పరిస్థితి నెలకొనడంతో రైతాంగం ఆందోళన
చెందుతోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమీక్షించి చర్యలు తీసుకోవాలని.. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయకుండా పొలంలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొనే పరిస్థితి కల్పించాలని ప్రభుత్వానికి జనసేనాని విజ్ఞప్తి చేశారు.

అనంతపురం జిల్లాలో ఈ ఏడాది 4.96 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా.. 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని.. కానీ.. అక్కడ కేవలం 1.8 లక్షల క్వింటాళ్లు మాత్రమే వేరుశనగ విత్తనాలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే చోట విత్తనం దొరకడం లేదని.. బయట వ్యాపారుల గోదాముల్లో ప్రభుత్వ సంచుల్లోనే వేరుశనగ విత్తనం దొరుకుతోందని రైతులు చెబుతున్నారంటే.. లోపం ఎక్కడుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో వరి పంటకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్నారు.

View image on Twitter

Recent Articles English

Gallery

Recent Articles Telugu