జ‌బ‌ర్ద‌స్త్ నుంచి హీరో అవుతున్న మరో కమెడియన్‌

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో ప్రేక్షకులకు దగ్గరైన నటులు తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శంకర్ హీరోగా ఒకటి, రెండు చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. పెద్దగా సక్సెస్ కాలేకపోయినా పర్వాలేదేమో అనిపించుకున్నాడు. తాజాగా మరో క‌మెడియ‌న్ మ‌హేశ్‌ ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. రంగ‌స్థలం సినిమాతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మహేశ్‌‌. ఇప్పుడు హీరోగా మారి నేను నా నాగార్జున అనే సినిమా చేస్తున్నాడు. కొత్త నిర్మాత నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్ బి గోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా మంది క‌మెడియ‌న్లు హీరోలుగా మారారు.. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రు కూడా పెద్ద‌గా స‌క్సెస్ అయింది లేదు. కానీ ఇప్పుడు మ‌హేశ్ మాత్రం క‌చ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడ‌తానంటున్నాడు. రంగ‌స్థ‌లం సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అసిస్టెంట్ పాత్ర‌లో మెప్పించాడు. దీనికి ముందు జ‌బ‌ర్ద‌స్త్ లోనూ ర‌ప్ఫాడించాడు మ‌హేష్. ఆ త‌ర్వాత శ‌త‌మానం భ‌వ‌తి లాంటి సినిమాల్లో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించాడు. మ‌రిప్పుడు ఈ కుర్ర క‌మెడియ‌న్ హీరోగా స‌క్సెస్ అవుతాడో లేదో చూడాలి.