చంద్రబాబుది రాక్షస పాలన

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం పాత బస్టాండ్‌ కూడలిలో వైసీపీ అధినేత జగన్‌ మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే సీఎం చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయని జగన్‌ విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పూర్తయ్యాయని.. మిగిలిన 10 శాతం పనులను ఈ నాలుగున్నరేళ్లలో సీఎం చంద్రబాబు పూర్తి చేయలేకపోయారన్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ఎన్‌సీఎస్‌ కర్మాగారానికి విక్రయించారని.. కర్మాగారం యాజమాన్యం రూ.12కోట్ల బకాయిలను చెరకు రైతులకు ఇంతవరకు చెల్లించలేదన్నారు. అంగన్వాడీ, సబ్‌స్టేషన్లలో ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని జగన్‌ ఆరోపించారు. అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన ఆస్తులన్నీ చంద్రబాబు బినామీలు కాజేస్తున్నారని, తోడుగా నిలవాల్సిన ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

విశాఖ విమానాశ్రయంలో తనపై సీఎం చంద్రబాబే దాడి చేయించకపోయుంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో సినీ నటుడిని దించింది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. బీజేపీ మీద నెపం వేస్తూ ఆపరేషన్‌ గరుడ పేరుతో స్క్రిప్టు రచన చేశారని ఆయన ధ్వజమెత్తారు. డబ్బులంటే తనకు వ్యామోహం లేదని, 30 ఏళ్లు సీఎంగా ఉండేలా పాలిస్తానని జగన్‌ వ్యాఖ్యానించారు. తాను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన తండ్రి ఫొటోతో పాటు తన ఫొటో కూడా ఉండాలన్నారు. చెడిపోయిన వ్యవస్థలోకి నిజాయతీ తన వల్లే సాధ్యమని చెప్పారు. కుట్రల గురించి మాట్లాడుతుంటే తన మనసు కలత చెందుతోందన్నారు. పురాణాల్లో రాక్షసుల కంటే చంద్రబాబుదే రెట్టింపు రాక్షస పాలనని జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన లాంటి దుష్టశక్తులు ఎన్ని కుట్రలు చేసినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన ఒంట్లో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం తపిస్తానని వైఎస్‌ జగన్‌ తెలిపారు.