‘తెలంగాణ, ఏపీ రెండూ వేర్వేరు కాదు’: కేసీఆర్‌, జగన్‌

తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు పటిష్టం చేసే దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రగతిభవన్‌లో కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలపై ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ రోజు ఉదయం 11గంటల నుంచి చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని ఇద్దరు సీఎంలూ అన్నారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని.. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున గోదావరి నీటిని తరలించాలని నిర్ణయించారు. గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే వ్యూహం ఖరారు చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులను ముఖ్యమంత్రులు ఆదేశించారు.

వివాదాలు కొనసాగిస్తే మరో తరానికి కూడా మనం నీళ్లివ్వలేమని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఏపీ సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చిందని.. ఏపీ సీఎం జగన్‌ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారన్నారు. మహారాష్ట్రతో సయోధ్య ఉండటంతోనే కాళేశ్వరం నిర్మించుకోగలిగామని చెప్పారు. తక్కువ ఖర్చుతో రెండు తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేద్దామని జగన్‌తో కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరిలో నీటి లభ్యతపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కృష్ణా, గోదావరిలో కలిపి 4వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని.. అందుబాటులో ఉన్న నీళ్లతో రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

గోదావరిలో ఏటా 3వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. నీళ్ల కోసం ట్రైబ్యునళ్లు, కోర్టుల చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన చేస్తోందని.. మన అవసరాలు తీర్చాక కేంద్రం ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలిస్తే ఇరు రాష్ట్రాలకు మేలు జరగుతుందని చెప్పారు. దీంతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, పాలమూరు, నల్గొండ జిల్లాలకు లబ్ధి కలుగుతుందన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం సారాంశాన్ని మంత్రులు ఈ సాయంత్రం 5గంటలకు మీడియాకు వెల్లడించనున్నారు.