కొత్తగా.. కొత్తగా.. కొత్తగా.. అంటున్న కీర్తి సురేష్‌


టాలీవుడ్‌లో రామ్‌ హీరోగా వచ్చిన నేను శైలజా చిత్రంతో పరిచయమయ్యారు కీర్తి సురేష్‌. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది ఈ బ్యూటీ‌. ఈ సినిమాలోని తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే కీర్తి ప్రస్తుతం మిస్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాలో నవీన్‌ చంద్ర, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా శుక్రవారం మూవీ నుంచి ఫస్ట్‌ లిరికల్‌ పాటను విడుదల చేసింది మూవీయూనిట్‌. ‘కొత్తగా కొత్తగా కొత్తగా రంగులే నింగిలో పొంగే సారంగమై’ అంటూ సాగే ఈ పాటను మెలోడి క్వీన్‌ శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. కళ్యాణ్‌ చక్రవర్తి లిరిక్స్‌ రాయగా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.