పెంగ్విన్ మూవీ రివ్యూ


హీరోయిన్‌ కీర్తి సురేష్ ప్రధాన ప్రాతలో నటించిన థ్రిల్లర్ మూవీ ‘పెంగ్విన్’. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో.. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉన్నదో రివ్యూ చూద్దాం.

కథ : కీర్తి సురేష్, లింగ భార్యాభర్తలు. వీరికి కొడుకు మాస్టర్ అద్వైత్. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన కొడుకు ఓరోజు ఆడుకుంటూ బయటకు వెళ్లి తిరిగిరాడు. ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకుని షాక్‌కు గురవుతుంది కీర్తి. అద్వైత్‌ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. అద్వైత్‌తో పాటు మరో ఆరుగురు పిల్లలు కూడా కనిపించకుండా పోతారు. కీర్తి సురేష్‌, లింగతో పాటు పోలీసులు కూడా అద్వైత్‌ను వెతికే పనిలో పడతారు. ఓరోజు అద్వైత్ దుస్తులు అడవిలో అక్కడక్కడా పడి ఉండటం చూసి తాను చనిపోయినట్టు భావిస్తారు. కానీ అద్వైత్ బతికే ఉన్నాడని గట్టిగా నమ్ముతుంది కీర్తి సురేష్. ఈ విషయంలో లింగ, కీర్తి సురేష్ గొడవ పడతారు. కీర్తి కారణంగానే అద్వైత్ కనిపించకుండా పోయాడని భావిస్తాడు లింగ. అందుకే కీర్తి సురేష్‌ నుంచి విడాకులు తీసుకుంటాడు. కానీ కీర్తి మాత్రం అద్వైత్ కోసం అన్వేషణ చేస్తూనే ఉంటుంది. అదే సమయంలో కీర్తికి రంగరాజ్‌ దగ్గరవుతాడు. అతనితో వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తుంది. అయినా అద్వైత్ కోసం బాధపడుతూనే ఉంటుంది. అసలు అద్వైత్ ఏమయ్యాడు? ఎవరు కిడ్నాప్ చేశారు? మరో ఆరుగురు పిల్లలు ఏమయ్యారు? అనేది మిగతా కథ.

నటీనటులు : మహానటి సినిమాతో ఉత్తమనటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రంలో తొలిసారి నటించింది. ఇందులో ఓకొడుక్కి తల్లిగా నటించింది. ఇందులో తన నటనతో ఆకట్టుకుంది. కథ మొత్తం ఆమె చుట్టూనే నడుస్తుంది. తల్లిగా, నిండు గర్భిణిగా, వైవిధ్యభరితమైన పాత్రల్లో కీర్తి అద్భుతంగా నటించింది. కనిపించకుండా పోయిన బిడ్డ కోసం తల్లిపడే ఆవేదనను చక్కగా ప్రదర్శించింది. మిగతా నటీనటులు తమ పరిధిమేరకు అలరించారు. సినిమాలో తమిళ నటులే ఎక్కువగా కనిపిస్తారు. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ అద్భుతంగా మ్యూజిక్ అందించాడు. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. కొడైకెనాల్ అందాలతో పాటు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలను బాగా తీర్చిదిద్దారు. కథ పాతదే అయినప్పటికీ, కథనాల్లో కొత్తదనం చూపించాడు దర్శకుడు. క్లైమాక్స్ మినహా మిగతా సినిమా అంతా బాగుందనే చెప్పాలి.

విశ్లేషణ: ఇది ఓ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ. అసలు సినిమా ఏంటనేది మొదటి ఫ్రేమ్ లోనే స్పష్టంగా చేశాడు దర్శకుడు ఈశ్వర్ కార్తీక్. ఆ తర్వాత ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పాలి. విషయాన్ని సాగదీయకుండా సూటిగా చెప్తూనే సస్పెన్స్ ను కొనసాగించాడు. మొదటి నుంచీ ఉత్కంఠ రేకెత్తించేలా కథనాన్ని తీర్చిదిద్దాడు. పిల్లలను కిడ్నాప్ చేసిన విధానం, అక్కడి నుంచి కీర్తి సురేష్ వారిని వెతుక్కుంటూ వెళ్లడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అడవిలో అద్వైత్ బట్టలు కనిపించినప్పుడు అందరూ చనిపోయారని భావించడం.. కీర్తి మాత్రం తన కొడుకు బతికే ఉన్నాడని నమ్మడం ఇటువంటి సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించాడు. ఆ తర్వాత అడవిలో తన కొడుకు సడన్‌గా కనిపించడంతో హమ్మయ్య అని ప్రేక్షకుడు రిలాక్స్ అయ్యేలోపే మళ్లీ కొత్త అనుమానాలు క్రియేట్ అవుతాయి. అసలు పిల్లలను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు అంటూ ప్రేక్షకులు మళ్లీ కథలో లీనమవుతారు. ఆసక్తి కలిగించేలా సన్నివేశాలను తెరకెక్కించాడు దర్శకుడు ఈశ్వర్ కార్తీక్. కిడ్నాప్ కారణాలు, కిడ్నాప్ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా ఇంటర్వెల్ తర్వాత బయటపెడతాడు. మిగతా పిల్లల కిడ్నాప్ కు, కీర్తి సురేష్ కొడుకు అద్వైత్ కిడ్నాప్ కు సంబంధం ఉండదు. ఇదే ఇందులో ట్విస్ట్. క్లైమాక్స్ సింపుల్‌గా తేల్చేయడంతో కాస్త చప్పగా అనిపిస్తుంది.

హైలైట్స్‌ : కీర్తి సురేష్ నటన

డ్రాబ్యాక్స్ : క్లైమాక్స్

టైటిల్ : పెంగ్విన్
నటీనటులు: కీర్తి సురేష్, ఆదిదేవ్, లింగ, మాస్టర్ అద్వైత్ తదితరులు
రచన, దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్ని
నిర్మాత : కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం : సంతోష్ నారాయణ్

చివరిగా : థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారిని అలరించే ‘పెంగ్విన్‌’
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates