మంత్రి కిడారి శ్రవణ్‌ రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కిడారి శ్రవణ్‌ తన పదవికి రాజీనామా చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో రాజీనామా లేఖను ఆయన అందజేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరునెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. వివిధ కారణాలతో అలా జరగనందున శ్రవణ్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా లేఖను సమర్పించడానికి ముందుఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్‌తో చర్చించారు. అనంతరం సచివాలయానికి వెళ్లిన శ్రవణ్‌‌.. సీఎం కార్యాలయ అధికారులకు రాజీనామా లేఖను సమర్పించారు.

రాజ్యాంగ నియమాల ప్రకారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేతలు.. ఆరు నెలల్లోపు ఏదో ఒక చట్టసభలో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. అలా జరగని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గతేడాది నవంబర్‌ 11న సీఎం చంద్రబాబు కేబినెట్‌ను విస్తరించారు. అప్పటికే శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌తో పాటు కిడారి శ్రవణ్‌కు మంత్రులుగా అవకాశం కల్పించారు. ఈనెల 10వ తేదీతో ఆరునెలల గడువు ముగియడం.. ఇప్పటి వరకూ ఏ సభలోనూ శ్రవణ్‌ సభ్యుడిగా ఎన్నిక కాకపోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన అరకు స్థానం నుంచి ఆయన పోటీ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates