రాజశేఖర్ ‘కల్కి’లో అదా శర్మ!

‘గరుడవేగ’ విజయం తర్వాత సీనియర్‌ నటుడు రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కల్కి’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో 1983 నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్ర‌శాంత్ వ‌ర్మ (‘అ!’ ఫేం) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇందులో నందితా శ్వేత ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం నిర్మాతలు రూ.5 కోట్లు ఖర్చుపెట్టి భారీ సెట్‌ నిర్మించినట్లు తెలిసింది.

కాగా ‘కల్కి’లో చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కోసం నటి అదా శర్మ సంతకం చేశారు. ఈ పాత్రకు ఆమె అయితే బాగా సరిపోతారని దర్శకుడు భావించి, సంప్రదించారట. రాజశేఖర్‌ సరసన నటించడం పట్ల అదా సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సినిమాలో బ్రిటిష్‌ మోడల్‌ స్కార్లెట్‌ విల్సన్‌ ప్రత్యేక గీతంలో ఆడిపాడనున్నారు. ఆమె ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, ఎవడు, బాహుబలి: ది బిగినింగ్‌’ తదితర చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు.

అదా 2016లో ‘క్షణం’ సినిమాలో చివరిసారిగా తెలుగు తెరపై కనిపించారు. 2017లో ఆమె నటించిన బాలీవుడ్‌ సినిమా ‘కమాండో 2’ విడుదలైంది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా వస్తోన్న ‘కమాండో 3’ షూటింగ్‌లో అదా బిజీగా ఉన్నారు. మరోపక్క ప్రభుదేవా కథానాయకుడి పాత్ర పోషిస్తున్న ‘చార్లీ చాప్లిన్‌ 2’ సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు.