ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం: కేటీఆర్‌

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కచ్చితంగా 16 లోక్‌సభ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ఈ బలం ఉంటేనే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చని వివరించారు. ఆదివారం కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిర్వహించిన విజయోత్సవ సభలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చాలా చోట్ల కొందరి ఓట్లు గల్లంతు కావడం, ఓటరు నమోదు కార్యక్రమం సమర్థంగా చేపట్టకపోవడం వల్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు చాలా చోట్ల మెజారిటీ తగ్గింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ తప్పు జరగకుండా చూడాలి. అందరూ చొరవ తీసుకొని గల్లంతైన ఓట్లను తిరిగి నమోదు చేయించేలా, కొత్తగా అర్హులైన ఓటర్లను నమోదు చేయించేలా డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి. డిసెంబరు 26 నుంచి జనవరి 24 వరకూ ఓట్లను తిరిగి నమోదు చేసుకొనే అవకాశం ఉంది. ప్రజలంతా ఏకోన్ముఖంగా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారు. ఓట్లు గల్లంతైతే మనకే నష్టం. ప్రతి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ తరఫున 12 వేల చొప్పున ఓటరు నమోదు ఫారాలను ఇప్పటికే అందజేశాం’ అని కేటీఆర్‌ పార్టీ డివిజన్‌ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

‘దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభ తగ్గుతోంది. గత ఎన్నికల్లో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణకు స్వయంగా వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. 103 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేవలం ఒకే స్థానం గెలిచింది. 11 మంది కేంద్రమంత్రులు, ఆరుగురు బీజేపీ ముఖ్యమంత్రులు ప్రచారం చేసి, ప్రలోభాలకు గురి చేసినా వాటిని ప్రజలు పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌కి ఘన విజయాన్ని అందించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేందుకు ఆస్కారం లేదు. ఎన్డీఏకు 150, యూపీఏకు 100 స్థానాలు దాటే పరిస్థితి లేదు. కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ‘రైతు బంధు’ను ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు కాపీ కొట్టాయి. మోడీ ప్రభుత్వం కూడా మార్పులు చేసి ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ సారి ప్రజలు 16 మంది పార్లమెంటు సభ్యులను టీఆర్‌ఎస్‌కు గెలిపిస్తే .. రైతులకు సంబంధించిన సమస్యలను దేశ ఎజెండాలో పెట్టొచ్చు. తెలంగాణ భారత దేశానికే ఒక దిక్సూచిలా అవతరిస్తుంది. ఢిల్లీ పెద్దలను యాచించడం కాదు.. శాంసించాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అనే వారు. కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాత్మక పాత్ర మనకు ఉంటే హైదరాబాద్‌ను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు’

‘కుల, మత, వర్గ బేధాలకు అతీతంగా ప్రజలంతా కేసీఆర్‌ను మళ్లీ గద్దెపై కూర్చోబెట్టారు. ఈ గెలుపుతో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగింది. పోలైన ఓట్లలో 47 శాతం ఓట్లు కేసీఆర్‌కు వచ్చాయి. మొత్తం 119 సీట్లలో 75 శాతం సీట్లను కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఈ ఘన విజయం అంకితం. నగరంలో ఎప్పటి నుంచో ఉన్న కీలక సమస్యలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిష్కరించింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పని చేస్తోందని ప్రజలు నమ్మారు. కేసీఆర్‌ నాయకత్వంపై ఉన్న విశ్వాసం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది.’

‘ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటిని కచ్చితంగా అమలు చేసి తీరతాం. పింఛన్లను రెట్టింపు చేస్తాం. డబుల్‌ బెడ్‌ రూంలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను మరిచే ప్రసక్తే లేదు. ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత మరో మాట చెప్పే పార్టీ కాదు టీఆర్‌ఎస్‌. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుంది. దీనిపై పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథిలా పని చేస్తా. కొన్ని చోట్ల అధికార తప్పిదాలు, ఓటర్ల నమోదులో లోపం జరగడం వల్ల చాలా చోట్ల మెజారిటీ తగ్గింది. 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయనే వార్తలొచ్చాయి. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది.’

‘ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో రకరకాల కారణాలతో పార్టీకి దూరమైన నాయకులు, కార్యకర్తలను దగ్గరకు చేర్చుకోండి. అందరిని కలుపుకొని ముందుకు పొండి. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్ల కంటే ఇంకా ఎక్కువ ఓట్లు పార్లమెంటు ఎన్నికల్లో రావాలి. ఓట్ల శాతం పెరగాలి. ఇందుకోసం మనమంతా కలిసి పనిచేద్దాం.’ అని కేటీఆర్‌ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.