టీఆర్‌ఎస్‌ను తిరుగు లేని రాజకీయ శక్తిగా మారుస్తా: కేటీఆర్‌

వందేళ్లపాటు తెలంగాణ రాష్ట్ర సమితిని రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమయ్యేలా మార్పులు చేస్తానని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్థాగతంగా పటిష్ఠంగా పార్టీ నిర్మాణం చేసి, ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలతో పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. ‘టీఆర్‌ఎస్‌ను భవిష్యత్తులో తిరుగు లేని రాజకీయ శక్తిగా మార్చేందుకు కేసీఆర్‌ ముఖ్యమైన బాధ్యతను నాకు అప్పగించారు. పేదలు, రైతులకు పార్టీ అంకితమయ్యేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. మీలో ఒకడిగా, సోదరుడిగా అన్ని రంగాల వారికీ అండగా ఉంటా. పార్టీని అజేయ శక్తిగా మారుస్తా. కేసీఆర్‌ నాపై పెట్టిన బాధ్యతను సవ్యంగా నిర్వర్తిస్తా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండేలా దేవుడు నాకిచ్చిన శక్తిని మొత్తం ఇందుకు వినియోగిస్తా’ అని వ్యాఖ్యానించారు.

బాధ్యతలు చేపట్టేముందు కేటీఆర్‌ తెలంగాణ తల్లికి, ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బసవతారకం ఆస్పత్రి నుంచి ర్యాలీగా కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ వేడుకను టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించగా.. పెద్ద సంఖ్యలో కేసీఆర్‌, కేటీఆర్‌ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. జెండాలు, పార్టీ నాయకుల చిత్రపటాల ప్రదర్శనతో ఆ తెలంగాణ భవన్‌ ప్రాంతమంతా గులాబీ మయంగా మారిపోయింది. డప్పు చప్పుళ్ల మోత, పోతు రాజుల విన్యాసం, బాణసంచా కాల్పులు మధ్య తెలంగాణ భవన్‌ పరిసరాలు సందడిగా మారాయి.