ఏపీ ప్రజలు సైకిల్ ఎక్కారంటున్న లగడపాటి

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వే రిపోర్ట్ ఈరోజు విడుదల చేస్తానని కొంత వరకు మాత్రమే వెల్లడించారు. శాస్త్రీయంగా చేసిన సర్వే ఫలితాలు రేపు సాయంత్రం వెల్లడిస్తానని తెలిపారు. అయితే ఈసారి తన సర్వేలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతారని చెప్పారు. అమరావతిలో లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. జనసేనాని కచ్చితంగా శాసనసభలో అడుగు పెట్టనున్నారని స్పష్టం చేశారు. అయితే జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం కంటే తక్కువ రావచ్చని అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఏప్రిల్ 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. విశాఖ జిల్లాలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు.

నాకు ఏ పార్టీతో సంబంధం లేదు.. సైంటిఫిక్‌గా ప్రజల నాడిని తెలుసుకోవడం హాబీగా పెట్టుకున్నాను కాబట్టి దానికనుగుణంగానే సర్వేలు చేశానని లగడపాటి తెలిపారు.ఏపీలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది.. తెలంగాణలో పార్లమెంటు స్థానాలు ఎవరికి ఎన్ని వస్తాయి అనేది రేపు వెల్లడిస్తానని అన్నారు. నేను చెప్పేది ఒక పార్టీకి అనుకూలం.. మరో పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు.. ఇద్దరికీ అనుకూలంగా చెప్పలేము కదా అన్నారు. ఏపీలో ప్రధానంగా మూడు పార్టీలో పోటాపోటీలో ఉన్నాయని అన్నారు. 90 నుంచి 95 శాతం ప్రజలు ఆ మూడు పార్టీలకే ఓటు వేశారని తెలిపారు. వీరిలో ఒక్కరే విజేత అవుతారు కానీ పాలక పక్షం, ప్రతిపక్షం కలిసి వెళ్లాలనేదే మా భావన అని లగడపాటి అన్నారు. రాజకీయ కోణంలో కాకుండా కేవలం సైంటిఫిక్‌గా నా హాబీగా చేసిన ఫలితాలుగా భావించాలంటూ ఈరోజు కొద్ది విషయాలు చెబుతానని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రజలు కారెక్కితే.. లోటు బడ్జెట్ ఉన్న ఏపీ ప్రజలు సైకిల్ ఎంచుకున్నారని చెప్పారు. ఏపీలో హంగ్ ఏర్పడే అవకాశమే లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి కచ్చితమైన మెజార్టీ వస్తుంది. కేంద్రంపై రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. అయితే ఇప్పుడు చెప్పినవన్నీ ఒక రాజకీయ నాయకుడిగా తన అంచనాలు మాత్రమేనని, రేపు సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తానని లగడపాటి రాజ్ గోపాల్ తెలిపారు.