HomeTelugu Big StoriesBalakrishna: హిందూపురంలో 40 ఏళ్ల రికార్డును వైసీపీ బ్రేక్ చేయగలదా?

Balakrishna: హిందూపురంలో 40 ఏళ్ల రికార్డును వైసీపీ బ్రేక్ చేయగలదా?

Balakrishna

Balakrishna: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరో రసవత్తరమైన నియోజకవర్గం హిందూపురం. ఇక్కడ గత 40 ఏళ్లుగా టీడీపీదే హవా. ఈనియోజకవర్గంలో ప్రస్తుతం సినీ హీరో బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే ఈ నియోజకవర్గంపై మరింత ఆసక్తికరంగా మారింది. టీడీపీకి బలమైన ఈ నియోజకవర్గంలో ఈసారి అధికార పార్టీ వైసీపీ గెలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

వైసీపీ నుంచి బీసీ మహిళా అభ్యర్థి దీపికను బరిలోకి దింపింది. కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత. దీపిక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీపిక బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. దీపిక భర్త వేణు రెడ్డి వైసీపీకి చెందిన నాయకుడు. హిందూపురం మండలంలోని బుడ్డంపల్లికి చెందిన వేణురెడ్డి.

హిందూపురంలో ఇప్పటి వరకు నందమూరి కుటుంబ సభ్యులే గెలుస్తూవచ్చారు. 2014, 2019లో నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య పట్టుమీదున్నారు. హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాలు ఈ అసెంబ్లీ పరిధిలోనే ఉన్నాయి. 1983నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ విజయ పరంపర కొనసాగుతోంది.

ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించారు.అయితే ఈసారి హిందూపురం స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ పావులు కదుపుతోంది. టీడీపీ కంచుకోటను బద్దలు కొడతామంటున్నారు. హిందూపురం నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అత్యంత కీలకం. బోయ, కురుబ, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు కూడా కీలకమే.

ఇక్కడ మొత్తం ఓటర్లు 2.46 లక్షలు ఉన్నారు. ఇందులో పురుషులు 1.23 లక్షలు కాగా మహిళా ఓటర్లు 1.22 లక్షలు ఉన్నారు. 2019 ఎన్నికల్లో బాలకృష్ణకు పోటీగా బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి షేక్ మహ్మద్ ఇక్బాల్. ఇతను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. చివరి నిమిషంలో వైసీపీ నుంచి టికెట్ దక్కించుకుని పోటీలో నిలిచారు. బాలకృష్ణ, ఇక్బాల్ మధ్యనే ప్రధానంగా పోటీ నడిచింది.

Balakrishna

బాలకృష్ణకు 51 శాతం ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి షేక్ మహ్మద్ ఇక్బాల్‌కు 42 శాతం ఓట్లు, జనసేనకు 2 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు పడ్డాయి. హిందూపురంలో బాలకృష్ణ తన సొంత ఇమేజ్‌తో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందూపురం ప్రజల్లో బాలకృష్ణకు మంచి పేరుంది. సొంత నిధులతో తన నియోజకవర్గంలో బాలకృష్ణ అభివృద్ధి పనులు చేయడం కూడా అతనికి కలిసొచ్చే అంశం.

అలాగే ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడంలో ముందుండటం వంటి అంశాలు బాలకృష్ణకు కలిసొచ్చే అంశాలు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం తద్వారా నియోజకవర్గానికి దూరంగా ఉండటం బాలకృష్ణకు మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన దీపికకు కురుబ, రెడ్డి సామాజిక వర్గాల మద్దతు సంపూర్ణంగా దక్కే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా.

వైసీపీలో కీలక నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు దీపికకు కలిసొచ్చే అంశం. వైనాట్ 175 అంటూ ఈసారి ఎన్నికల బరిలో టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్ ముఖ్యంగా 3 నియోజకవర్గాలపై గురిపెట్టారు. వీటిలో నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంతో పాటు హిందూపురం కూడా ఒకటి.

అందుకే హిందూపురం బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. హిందూపురంలో 40 ఏళ్ల టీడీపీ రికార్డును బ్రేక్ చేస్తామని పెద్దిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ అస్త్ర శస్త్రాలను సిద్ధంచేస్తోంది. అయితే బాలకృష్ణ మాత్రం ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని టీడీపీ నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు.

బాలకృష్ణ సతీమణి కూడా హిందూపురంలో పర్యటిస్తూ స్థానిక మహిళలను కలుస్తూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో వైసీపీ ఎలా చెక్‌పెట్టబోతుందోనని ఆసక్తిగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu