తెలంగాణలో ప్రజల నాడి హస్తానికి చిక్కింది!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఆసక్తికరంగా ఎన్నికలు ముగిశాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగు ప్రజలే కాకుండా యావత్‌ దేశం ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోందన్నారు. తాము అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేసినప్పటికీ తెలంగాణ ఎన్నికల్లో చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా డబ్బు పంపిణీ జరిగిందని, అనేక ప్రలోభాలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రజల నాడి హస్తానికి చిక్కిందని, ప్రజాకూటమికి 55 నుంచి 75 స్థానాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 25 నుంచి 45 స్థానాలు వస్తాయని చెప్పారు. ఎంఐఎంకు 7 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. టీడీపీ 5 నుంచి 9 స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నారు. రెండు స్థానాలు అటు ఇటుగా స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు గెలుస్తారని చెప్పారు. బీజేపీకి ఐదు నుంచి తొమ్మిది స్థానాలు వస్తాయని తాము అంచనా వేస్తున్నామన్నారు. సీపీఎం నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్‌కు ఒక సీటు ఖమ్మం జిల్లాలో వచ్చే అవకాశం ఉందన్నారు.

తమ ఆర్జీ ఫ్లాష్‌ టీం సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు అనేక దఫాలుగా ప్రజల నాడి, మనోభావాలు, వారు ఎటువైపు మొగ్గుచూపుతున్నారనే అంశాలపై సర్వే చేసిందని వెల్లడించారు. గత ఎన్నికల్లో 68.5 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈ రోజు తెలంగాణలో 72 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తమకు ఓ అంచనా ఉందని, రాత్రి 9గంటలకు పూర్తి పోలింగ్‌ నమోదు శాతం వచ్చే అవకాశం ఉందన్నారు. అధిక శాతం పోలింగ్‌ ఈసారి నమోదైందని చెప్పారు. గతంలో తాను 8 నుంచి 10 స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది నుంచి 10 మంది గెలుస్తారని చెప్పానని, అయితే, ఈ రెండు రోజులు హోరాహోరీగా ప్రచారంతో పాటు రాజకీయ పార్టీల అభ్యర్థులు అనేక రకాల ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఎన్నడూలేని విధంగా ఈ ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చయినట్టు చెప్పారు. అన్ని పార్టీల అభ్యర్థులూ గతంలో ఎప్పుడూలేని విధంగా ఖర్చుపెట్టి, ఓటర్లను అనేక ప్రలోభాలకు గురిచేశారని తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates