‘ఎన్టీఆర్‌‌’ నుంచి (మోర్ థన్ ఏ హీరో) సాంగ్‌

నందమూరి తారకరామరావు జీవితాధారంగా వస్తున్న’ఎన్టీఆర్‌‌’ బయోపిక్‌లోని టైటిల్‌ సాంగ్‌కు సంబంధించిన లిరికల్‌ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలోని మిగతా పాటలతో పోలిస్తే ఈ పాట అటు మాస్‌ను ఇటు క్లాస్‌ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది. ‘నువ్వు రాముడేషమే కట్టావంటే గుండెలు అన్నీ గుడులైపోతాయే..’ అంటూ సాగుతున్న ఈ పాటను కాల భైరవ, పృథ్వీ చంద్ర ఆలపించారు. ఇందులో ఎన్టీఆర్‌కు సంబంధించిన అలనాటి ఫొటోలను కూడా చూపించారు. వీడియో చివర్లో ఎన్టీఆర్‌తో కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎం.ఎం కీరవాణి దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. దానిపై ‘మీ వీరాభిమాని కీరవాణి’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

శుక్రవారం ఈ చిత్ర ఆడియో లాంచ్‌ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఇదే వేడుకలో ట్రైలర్‌ను కూడా లాంచ్‌ చేశారు. ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ‘ఎన్టీఆర్‌’ పాత్రలో బాలకృష్ణ నటించారు. ఎన్‌బికే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’గా ఈ చిత్రం 2019 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.