మరోసారి శ్రీమంతుడుగా మహేష్‌బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మరోసారి శ్రీమంతుడిగా కనిపించనున్నారట. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘శ్రీమంతుడు’లో ఆయన సంపన్నుడి వారసుడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే కథాంశంతో రూపొందిన ఈ సినిమా సూపర్‌హిట్‌ అయ్యింది. కాగా ‘మహర్షి’ కోసం మరోసారి మహేశ్‌ కోటీశ్వరుడి పాత్రను పోషిస్తున్నారట.

ఈ మేరకు సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రపంచంలోనే కోటీశ్వరులైన ఐదు మందిలో మహేష్‌ ఒకరుగా కనిపించనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు అమెరికాకు చెందిన ఓ కంపెనీకి సీఈవోగానూ సందడి చేయనున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో?.. చిత్ర బృందం చెప్పాల్సిందే.

మహేశ్‌ 25వ చిత్రంగా ‘మహర్షి’ తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. అల్లరి నరేష్‌, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.‌