
ఏపీ ఐటి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ గురించి చెప్పుకోవడానికి కూడా ఆంధ్ర ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. అంతగా ఆయనకు ఆంధ్రాలో పలుకుబడి ఉంది. దీనికితోడు ఈయనగారు చేసే కామెడీ కూడా మరీ విచిత్రంగా ఉంటుంది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించే స్థాయికి చేరుకుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ‘మా రాజధాని ఎక్కడ ? అని సుప్రీంకోర్టులో, పార్లమెంటులో అడుకొంటూ కాలక్షేపం చేస్తూ వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఏటా లక్షల కోట్లు పెట్టుబడులతో భారీగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలని ఆకర్షిస్తూ, తెలంగాణ జిల్లాలలో కూడా ఐటి హబ్‌లు ఏర్పాటు చేయిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మరి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఏమిటి ?, ఇంతకీ ఇతగాడు ఏమీ చేస్తున్నాడు ?. ఏమీ చేయడం లేదు.
మొన్నే హైదరాబాద్ వచ్చి కేటీఆర్ తో ఫోటో దిగాడు. ఆ తర్వాత కేటీఆర్ ఏర్పాటు చేసిన ఈ-రేసింగ్ పోటీలని చూసి ఆనందించారు కూడా!. ఇదండీ.. మన ఐటి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి. మనోడిని చూసి తెలంగాణ జర్నలిస్ట్ లు కూడా నవ్వుకున్నారు. ఇందులో భాగంగానే “ఏపీలో ఫార్ములా ఈ రేసింగ్ ఎప్పుడు నిర్వహిస్తారంటూ” విలేఖరులు అతగాడికి ఓ ప్రశ్న సంధించారు. జర్నలిస్ట్ ల ప్రశ్నలో వ్యంగ్యం కూడా అర్ధం కాలేదు అంటే.. ఆంధ్ర ప్రదేశ్ ఐటి, పరిశ్రమల మంత్రి రేంజ్ ఏమిటో అర్ధం అవుతుంది. అర్దమైనప్పటికీ, ప్రజలు ఇప్పుడు ఏం చేయగలరు ?.
ఇంతకీ “ఏపీలో ఫార్ములా ఈ రేసింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు ?’ అని అడిగితే.. మన అమర్నాథం ఏమీ చెప్పాడో తెలుసా ?. “తెలుగు ప్రజలందరూ గర్వపడేలా అందరం కలిసి హైదరాబాద్‌ని నిర్మించుకున్నారట. అలాగే ఈ పోటీలు కూడా నిర్వహించుకొన్నాము అట. ఏమిటో మన అమర్నాథం ఏమీ మాట్లాడుతున్నాడో అతగాడికే అర్ధం కావడం లేదు. ఇంకా అమర్నాథం చాలా ఆణిముత్యాలు వదిలాడండోయ్. హైదరాబాద్ ఈ స్థాయికి అభివృద్ధి చెందడంలో ఆంధ్రా ప్రజల భాగస్వామ్యం కూడా ఉందట. ఇంకా నయం.. జగన్ రెడ్డి భాగస్వామ్యం ఉందని చెప్పలేదు. ఇక పనిలో పనిగా తనకు ఎంతో గర్వంగా ఉంది అని మన అమర్నాథం చెప్పుకొచ్చాడు.
అలాగే కోడి గుడ్డు పెట్టగలదు కానీ కోడి కోడిని పెట్టలేదు కదా ?, ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది. కోడిపెట్టగా మారడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు మేము తప్పకుండా మా విశాఖ రాజధాని నగరంలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహిస్తాము,” అని అమర్నాథం కామెడి చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించి అమరావతి నిర్మాణ పనులు చేపట్టి, అమరావతికి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశారు. ఆ ఇమేజ్ ను అలాగే కాపాడుకుని ఉండి ఉంటే.. ఈ రోజు ఫార్ములా ఈ రేసింగ్ ఏపీలో కూడా జరిగి ఉండేది. కానీ జగన్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడు ఆంధ్ర అంతా అంధకారం అయిపోయింది.












