HomeTelugu Big Storiesనా పెళ్లి రోజే కొత్త సినిమా ప్రారంభం

నా పెళ్లి రోజే కొత్త సినిమా ప్రారంభం

ప్రముఖ నటి అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్‌’. కన్నడలో ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని పవన్‌కుమార్‌ తెరకెక్కించారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సమంత పాల్గొన్నారు.

14b

ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమంత ఈ విధంగా సమాధానాలు ఇచ్చారు.
‘యు టర్న్‌’ చేయడానికి బలమైన కారణమేమైనా ఉందా అని అడగ్గా.. సమంత.. దర్శకుడు పవన్‌కుమార్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన ‘లూసియా’ నాకు బాగా నచ్చింది. అప్పుడే కలిసి సినిమా చేద్దామని చెప్పా. కన్నడలో ‘యు టర్న్‌’ ట్రైలర్‌ విడుదల కాగానే నేను ఫోన్‌ చేసి సినిమా స్క్రిప్ట్‌ పంపమన్నా. నాకు బాగా నచ్చడంతో రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నా. అయితే ఇతర సినిమాల వల్ల ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టింది.

ఎక్కువగా సాహసోపేతమైన పాత్రల్నే ఎంపిక చేసుకొంటున్నారు. ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా అని అడగ్గా.. నిజంగానే ఈ ఏడాది చాలా సాహసాలు చేశాను. ‘రంగస్థలం’లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించడం, కొత్త దర్శకుడితో చేసిన ‘అభిమన్యుడు’ అలాగే ‘మహానటి’ చిత్రాలు కూడా నా వరకు సాహసోపేతమైన ప్రయత్నాలే. ‘యు టర్న్‌’లో స్టార్‌ హీరోలు ఎవరూ లేరు. కేవలం కథని నమ్మి చేసిన చిత్రమిది. ఇది నా సినీ ప్రయాణంలోనే అతి పెద్ద సాహసం. అయితే… ఇంతటితో ఆపను, మరిన్ని ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది. నా అదృష్టం కొద్దీ నేను కోరుకున్న పాత్రలే లభిస్తున్నాయి.

14 4

ఈ చిత్రంతో నటిగా మరింతగా పేరొస్తుందనుకోవచ్చా అని అడగ్గా.. చేసిన సినిమాకి పేరు మాత్రం వస్తే సరిపోదు, డబ్బులు పెట్టిన నిర్మాతలు, పంపిణీ చేసినవాళ్లకి లాభాలొచ్చినప్పుడు నాకు సంతోషం. అదే నాకు అసలు సిసలు విజయం. బాక్సాఫీసు లెక్కలు కూడా కీలకంగా పరిగణిస్తుంటా.

ఈసారి బాక్సాఫీసు దగ్గర మీ భర్తకీ, మీకు మధ్యే పోటీ ఎదురైంది కదా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. సమంత.. ఈ పోటీని నేనస్సలు ఊహించలేదు. చైతూ సినిమా ఆగస్టు 31నే విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దాంతో రెండు వారాల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మేం మాత్రం మొదట్నుంచీ సెప్టెంబరు 13 అని చెబుతూనే ఉన్నాం. మా ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే చిన్నపాటి ఉత్కంఠ ఉన్నమాటైతే నిజం. కానీ భార్యగా నా భర్త చైతన్య విజయాన్నే కోరుకుంటా. తన విజయం తర్వాతే నాకు ఏదైనా. వేర్వేరు బేనర్లతో కూడిన సినిమాలు కాబట్టి ప్రేక్షకులు కూడా రెండు సినిమాల్నీ చూస్తారు.

14a

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు సమాధానంగా.. రచన అనే ఓ పాత్రికేయురాలిగా కనిపిస్తా. ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలు ఒక ఎత్తయితే, ఈ సినిమాలో పాత్ర మరో ఎత్తు. ఈ సినిమాలో నాలోని డ్యాన్సర్‌ని కూడా చూస్తారు. స్వతహాగా నేను మంచి డ్యాన్సర్‌ని. స్కూల్లోనూ, కాలేజీలోనూ తెగ డ్యాన్స్‌ చేసేదాన్ని. ఈ సినిమాలోని ‘ది కర్మ’… అనే థీమ్‌ సాంగ్‌ కోసం బాగా డ్యాన్స్‌ చేశా. దాంతో ఇన్నాళ్లకి అసలైన సమంతని చూశామని నా స్నేహితులు అంటున్నారు. నా పాత్రే కాదు… ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఓ మంచి కథ ఇది. ఒక సినిమా కోసం ఎంతైనా కష్టపడతా. ప్రతి చోటా విలాసవంతమైన సౌకర్యాలే ఉండాలనుకోను. నా వరకు ఈ సినిమా చిత్రీకరణ ఓ గొప్ప అనుభవం. ఎందుకంటే నా సినిమాలు ఖరీదైన ప్రాంతాల్లోనూ, సెట్స్‌లోనూ చిత్రీకరణ జరుపుకొన్నవి చాలా ఉన్నాయి. కానీ ఈ చిత్రం కోసం రోడ్లమీద, ఆటోల్లోనూ చిత్రీకరణ జరిపాం. అలాగే ‘మహానటి’ తర్వాత ఈ చిత్రానికి కూడా సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొన్నా. నటిగా నన్ను నేను నిరూపించుకున్నా. కానీ ప్రేక్షకులకు ఏం ఇస్తున్నాననే విషయంపై అనుక్షణం ఆలోచించేదాన్ని. అందులో భాగంగానే ఇకపై నా పాత్రలకి నేను డబ్బింగ్‌ చెప్పాలని నిర్ణయించుకొన్నా.

కొత్త సినిమాల కబుర్లు చెబుతారా అనే ప్రశ్న పై సమంత.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం అక్టోబరు 6న సెట్స్‌పైకి అడుగుపెడుతున్నాం. ఆ రోజే నా పెళ్లి రోజు. అదే నాకు పెళ్లి రోజు కానుక అనుకుంటా (నవ్వుతూ). త్వరలో మరో పెద్ద సినిమా చేయబోతున్నా. త్వరలోనే ఆ వివరాల్ని ప్రకటిస్తా. అలాగే ఇప్పటిదాకా సాధించిన అనుభవంతో, అన్నపూర్ణ స్టూడియోస్‌ అండతో భవిష్యత్తులో నిర్మాణంపై కూడా దృష్టిపెట్టబోతున్నా. పెళ్లి తర్వాత ఎక్కువ సినిమాలు చేస్తున్నారేంటి? అని అడుగుతుంటారు చాలామంది. పెళ్లి తర్వాత నాకు మరింత బలం చేకూరినట్టైంది. కుటుంబం అండగా ఉంది. దాంతో ఎక్కువ సినిమాలు చేయగలుగుతున్నా. ఇంట్లో సినిమాల గురించి అస్సలు చర్చించం కానీ… నేను నిజాయతీగా నా అభిప్రాయాల్ని చెబుతుంటాను. దాంతో నా భర్తతో పాటు నా కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ల సినిమాలకి సంబంధించిన కథలు చెబుతుంటారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu