ఫేక్‌ వార్తలను నమ్మకండి: నితిన్‌

సినీ నటుడు నితిన్ తన సినిమాల గురించి స్వయంగా వెల్లడించేవరకూ ఎవ్వరి మాటలూ నమ్మొద్దని అంటున్నారు. ఆయన మున్ముందు చేయబోయే ప్రాజెక్ట్‌ల గురించి తప్పుడు సమాచారంతో వార్తలు వెలువుడుతున్నాయి. దాంతో ఆయన తాజాగా ట్విటర్ ద్వారా అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. ‘నేను చేయబోయే సినిమాల గురించి, అప్‌డేట్స్‌ గురించి నా అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా ప్రకటిస్తాను. నా గురించి వచ్చే ఎలాంటి ఫేక్‌ వార్తలను నమ్మకండి. థాంక్యూ’ అని నితిన్‌ ట్వీట్‌ చేశారు. గురువారం హోలీ పండుగను పురస్కరించుకుని నితిన్‌ తన కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల నుంచే చిత్రీకరణ మొదలు కాబోతోంది. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చబోతున్నారు. మరోపక్క రమేశ్‌ వర్మ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కానీ నితిన్‌ మాత్రం ఈ సినిమా గురించి నిన్న ప్రకటించలేదు. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్‌ను బట్టి చూస్తే నితిన్‌.. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారన్న వార్తలు అవాస్తమని తెలుస్తోంది.