పాక్‌ జవాన్ల ట్రీట్‌ బాగుంది.. నేను క్షేమంగా ఉన్న..

భారత పైలట్‌ విక్రమ్ అభినందన్‌కు సంబంధించి మరో వీడియోను పాక్‌ విడుదల చేసింది. భారత యుద్ధ విమానం మిగ్‌-21 తమ భూభాగంలో కూలినప్పుడు పారాచ్యూట్‌ సహాయంతో కిందకు దూకిన ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పాక్‌ వెల్లడించింన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ ఆర్మీ అధికారులు అభినందన్‌ను ప్రశ్నలు అడుగుతూ తీసిన ఓ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో అభినందన్‌ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ జవాన్ల ట్రీట్మెంట్‌ బాగుందని అభినందన్‌ తెలిపారు. మీ లక్ష్యం ఏంటని పాక్‌ అధికారులు అడిగిన ప్రశ్నకు.. జవాబు చెప్పదలచుకోలేదని పేర్కొన్నారు. విమాన వివరాల కూపీ లాగడాని పాక్‌ ఆర్మీ అధికారులు ప్రయత్నించగా, అందుకు తానేమీ చెప్పదలచుకోలేదని అభినందన్‌ చెప్పారు. అభినందన్‌ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు. పాక్‌ ముందు విడుదల చేసిన వీడియోలో అభినందన్‌పై దాడి దృశ్యాలు ఉండటంతో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుందన్న నేపథ్యంలో మరో వీడియోను విడుదల చేసినట్టు భావిస్తున్నారు.