భారత యుద్ధ వీరుడు పాక్ చెరలో ఏమన్నాడంటే..!


పాకిస్థాన్‌ చెరలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్. యుద్ధ విమానం క్రాష్ అయి తీవ్ర గాయాలపాలై ప్యారాచూట్ సహాయంతో ప్రాణాలు దక్కించుకున్నా.. శత్రు దేశమైన పాక్ భూభాగంలో పడటంతో అక్కడి స్థానికులు చుట్టుముట్టారు. శత్రు వలయంలో ఉన్నా మనో నిగ్రహం కోల్పోలేదు అభినందన్. చేతులు వెనక్కి కట్టి ప్రశ్నలు గుప్పిస్తున్నా వెరవలేదు. బిడియాన్ని దరిచేరనివ్వలేదు. తనను ప్రశ్నిస్తున్న పాకిస్థాన్‌ అధికారులకు దీటుగా, తెలివిగా, గంభీర స్వరంతో బదులిచ్చారు. తన పేరు, సర్వీసు నంబరు, మతాన్ని వెల్లడించిన అభినందన్‌… మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించారు. క్షమించండి.. నేనంతే చెప్పాలనుకున్నానంటూ సైనికాధికారులతో అన్నారు. పాకిస్థాన్‌ విడుదల చేసిన ఈ వీడియో నిమిషాల్లోనే సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టింది. కమాండర్‌ సమాధానాలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత తాగేందుకు టీ ఇచ్చిన పాక్‌ అధికారులు ఆయనతో సంభాషణ కొనసాగించారు.

ఇక్కడ మా నుంచి మీకు మంచి ఆతిథ్యమే లభించిందనుకుంటా? అని పాక్‌ అధికారి అడిగిన ప్రశ్నకు అవును అని సమాధానమిచ్చాడు అభినందన్‌. ఒకవేళ నేను భారత్‌కు తిరిగి వెళ్లినా నా మాటను మార్చకుండా ఇప్పుడు చెబుతున్న స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని కోరుతున్నా అన్నాడు. పాకిస్థాన్‌ సైన్యాధికారులు నన్ను బాగా చూసుకున్నారు. మూకల నుండి నన్ను కాపాడిన సైనికులు, కెప్టెన్‌ మొదలు.. ఆ తర్వాత అధికారులు కూడా నన్ను బాగా చూశారు. మా సైనికులు కూడా ఇలాంటి స్నేహభావమే కనబరుస్తారని ఆశిస్తున్నా అన్నాడు. భారత్‌లో మీది ఏ ప్రాంతం? మీకు పెళ్లయిందా? అన్న ప్రశ్నలకు.. అభినందన్‌ సమాధానమిస్తూ నేను వీటికి సమాధానం చెప్పాలా మేజర్‌? క్షమించండి. నాది దిగువ దక్షిణ ప్రాంతం అన్నాడు. టీ మీకు నచ్చిందనుకుంటా… అద్భుతంగా ఉంది. థ్యాంక్యూ! అన్నాడు. మీరు ఏ విమానం నడిపారు? అన్న ప్రశ్నకు అభినందన్‌.. క్షమించండి మేజర్‌. నేను ఈ విషయం చెప్పకూడదు. విమాన శకలాలను మీరు తప్పకుండా చూసే ఉంటారు అన్నాడు. అసలు మీ పనేంటి? అంటే క్షమించండి. నేను ఈ విషయం చెప్పను అని అభినందన్‌ సమాధానమిచ్చాడు. ఒకే..థ్యాంక్యూ అనిపాక్ అధికారి ముగించాడు. పాకిస్థాన్‌ విడుదల చేసిన ఈ వీడియో నిమిషాల్లోనే సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టింది. కమాండర్‌ సమాధానాలకు అభినందనలు వెల్లువెత్తాయి.

CLICK HERE!! For the aha Latest Updates