తెలంగాణ ప్రజల మనసులో మాట ఇదే: పవన్ కల్యాణ్

తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ సంచలన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు సినీ నటుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలుపుతూ లేఖను విడుదల చేశారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత ఏమిటో మరోసారి రుజువైందని అన్నారు. తన తరపున తన శ్రేణుల తరపున పవన్‌ హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రజల తీర్పును పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన టీఆర్‌ఎస్ పార్టీకి, అధినేత కేసీఆర్‌కు ప్రజలు తన మనసులోని మాటను భారీ మెజారిటీ అందించడం ద్వారా తెలియజేశారని అన్నారు. కేసీఆర్‌తో పాటు, తనయుడు కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌పై పెట్టుకున్న ఆశలను ఆయన తప్పక నెరవేరుస్తారని తనకు పూర్తి నమ్మకముందని పవన్ తెలిపారు. అలాగే తెలంగాణ చరిత్రలో డబుల్ హ్యాట్రిక్‌ విజయంతో రికార్డు సృష్టించిన కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావుకూ పవన్
అభినందనలు తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్‌లో విజయం సాధించిన వారితో పాటు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.