
ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలకు ఏ నాయకుడు వ్యతిరేకి కాలేడు. కానీ, జగన్ మెహన్ రెడ్డి వచ్చాక, కేవలం సంక్షేమ పథకాలే ప్రభుత్వ పాలనగా మారిపోయింది. సంపద సృష్టించడానికి చర్యలు చేపట్టకుండా.. ఎంతసేపూ సంక్షేమం కోసం అప్పులు చేసుకుంటూ పోతే ఏమవుతుంది ?, అప్పుల ఫలితాలు ఎలా ఉంటాయో ? నేడు పాకిస్తాన్ పరిస్థితులు చక్కగా చెబుతున్నాయి. అయినా జగన్ మోహన్ రెడ్డి అప్పుల కుప్పలో పావుగా మారిపోతూ ఉండటం నిజంగా ఏపీ ప్రజలంతా చింతించాల్సిన అంశం.
అసలు, అప్పులు తెచ్చి డబ్బులు పంచుతుంటే ఆ అప్పులు ఎవరు తీరుస్తారు ?, తీర్చే మాట ఎలా ఉన్నా ఐదేళ్ల తర్వాత వడ్డీలు కట్టడం మొదలవుతుంది, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇరవై వేల కోట్లు వడ్డీలు కడుతుంది. ఐదేళ్ల తర్వాత అది ఏభై వేల కోట్లకి కూడా చేరొచ్చు. ఎందుకంటే.. ఇక్కడ ఉంది జగన్ ప్రభుత్వం, కాబట్టి అంతకన్నా ఎక్కువ సంఖ్య కూడా ఉండొచ్చు. మరి అప్పుడు వడ్డీలు చెల్లించడానికి మళ్లీ కొత్త అప్పులు చెయ్యాల్సిందే కదా. మరి ఇలా ఇంకా ఎంత కాలం ?, అప్పులు చేస్తూ పోతూ వడ్డీలు కడుతూ ఉంటే.. ఇంతకీ అసలు అప్పు తీరేది ఎప్పుడు ?,
ఇవన్నీ సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. ఆ అప్పుతో మాకేం సంబంధం అని వారంతా అనుకుంటూ ఉండొచ్చు. సహజంగా వారంతా అలాగే భావిస్తారు. రాష్ట్రం అప్పు రాష్ట్ర ప్రజల పైనే భారం అవుతుందని.. ఏపీ ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల పైన ఉంది. అంతకంటే ముఖ్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం పై ఉంది. అప్పు తేవడమే కాదు, ఆ అప్పు ఎందుకు తెస్తున్నాం, తేవడం వల్ల ప్రస్తుతం కలిగే ఉపయోగం ఏమిటి ?, భవిష్యత్తులో కలిగే నష్టాలు ఏమిటి ? అని జగన్ రెడ్డి తన రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత అతని పై ఉంది.
అయినా, జగన్ రెడ్డి పట్టించుకోడు. జగన్ రెడ్డికి తెలిసింది ఒక్కటే.. బటన్లు నొక్కడం. అసలు ఇప్పటికే చిన్నా, చితకా అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు, NREGA పనులు చేసిన కాంట్రాక్టర్లు తమ బిల్లుల పేమెంట్ కోసం కోర్టులకి ఎక్కుతున్నారు. ఈ విషయంలోనే జగన్ రెడ్డి దారుణంగా విఫలం అయ్యాడు. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేని ఏకైక ముఖ్యమంత్రిగా కూడా జగన్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. అయినా, ఇప్పటికీ జగన్ రెడ్డికి డబ్బులు పంచడం తప్ప, వేరే ఆశయం లేనట్లుగా ఉంది. పైగా డబ్బులు పంచడమే అభివృద్ధి అని సమర్ధించుకోవడం ఆశ్చర్యంగానూ ఉంది.
జగన్ రెడ్డి అసలు నీకు సంక్షేమం ఎలా ఉండాలో తెలుసా ?, ముందు సంపద సృష్టించడానికి తీసుకున్న చర్యలు ఏమిటి ?, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి ?, తదనుగుణంగా సంక్షేమం ఉండాలి. అంతేగాని బటన్లు నొక్కడం సంక్షేమం కాదు. అసలు ఈ రోజు ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కకొ వ్యక్తి పై సగటున లక్ష రూపాయల అప్పు ఉంది. లక్ష రూపాయల అప్పు అంటే భారీ మొత్తం. ఈ మొత్తాన్ని బటన్ రెడ్డి ఏపీ ప్రజలందర్నీ అప్పుల్లో పడేశాడు అని స్పష్టం అవుతుంది. అయ్యో పాపం ఏపీ ప్రజలు. అప్పు చేసి పప్పు కూడు అన్న చందంగా పరిపాలన ఉండకూడదు బటన్ రెడ్డి. ఇకనైనా మారవయ్యా బాబు. లేకపోతే ఏపీకి బాబునే దిక్కు.













