‘పీహూ’ మూవీ రివ్యూ

movie-poster
Release Date
November 16, 2018

రెండేళ్ల పాప ముఖ్య పాత్రధారిగా కనిపించిన తొలి చిత్రంగా ప్రత్యేకత చాటుకుంది ‘పీహూ’. అందుకే ఈ సినిమాని గిన్నిస్‌ పరిశీలనకు పంపించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. తన ఇంట్లో ఒంటరిగా చిక్కుకుపోయిన ఆ పాపకు ఎలాంటి భయానక అనుభవాలు ఎదురయ్యాయన్న కథాంశంతో దర్శకుడు వినోద్‌ కప్రి ఈ మూవీని తెరకెక్కించారు. ఆ పాత్రలో మైరా విశ్వకర్మ నటించింది. నాలుగు నెలల పాటు చిత్రబృందం ఆ చిన్నారితో గడిపి తనతో మంచి అనుబంధం ఏర్పడ్డాకే ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగామని చెప్పారు వినోద్‌. మరి ‘పీహూ’ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిందా? గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించేంతగా ఈ చిత్రంలో ఏముంది..? చూద్దాం.

కథ: పీహూ (మైరా విశ్వకర్మ) తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు ఇంట్లో జరిగిన ఓ సంఘటనతో రెండేళ్ల చిన్నారి పీహూ ఒంటరిగా ఉండిపోతుంది. కనీసం ఇంట్లో పాప ఒంటరిగా ఉన్నట్లు కూడా ఎవ్వరికీ తెలీదు. పీహూను చూసుకునేవారు ఎవ్వరూ లేకపోవడంతో రోజూ తన తల్లి చేసే పనులు చూసి తానే వంటచేసుకోవాలని అనుకుంటుంది. కానీ చేత కాక ఆకలితో అలమటిస్తూ ఉంటుంది పీహూ. ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఆ చిన్నారి చివరకు ఏం చేసింది? అసలు పీహూ తల్లిదండ్రులు ఏమైపోయారు? తదితర విషయాలు తెలీయాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు : సినిమా మొత్తం మైరా విశ్వకర్మే నడిపిస్తుంది. అంత చిన్న పిల్లే అయినా చక్కగా నటించింది. తను తెలీక చేసే పనులు కూడా సన్నివేశంలా చక్కగా తెరకెక్కించారు వినోద్‌. ఇందులో మైరా తల్లిగా ప్రేరణా పాత్ర కొద్దిసేపే అయినా ఆమె కూడా చక్కగానే నటించారు. ఇక మైరా తండ్రిని మాత్రం కేవలం ఫొటోల రూపంలోనే చూపించారు దర్శకుడు. సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా పాత్రలూ లేవు.

విశ్లేషణ : సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘పీహూ’. అదీకాకుండా సినిమా మొత్తం రెండేళ్ల చిన్నారితో తెరకెక్కించడం ఇదే మొదటిసారి. దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నిజ జీవిత సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వినోద్‌. సినిమా మొదలైన ఐదు నిమిషాల తర్వాత వచ్చే ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు చిన్నారి తెలీక ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుందోనన్న భయం ప్రేక్షకుడిని వెంటడుతుంది. అమ్మ కోసం ఏడుస్తూ, తిండి, నిద్రలేక అష్టకష్టాలు పడుతున్న ఆ చిట్టితల్లి పరిస్థితిని చూస్తే హృదయం ద్రవించకమానదు. అయితే కొన్ని సన్నివేశాలతో చిన్నారికి పొంచి ఉన్న ముప్పును మరీ భయంకరంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ సినిమా ప్రతీ తల్లిదండ్రులకు వచ్చే పీడకల లాంటిదని ట్రైలర్‌ ద్వారానే వెల్లడించారు వినోద్‌. బొమ్మ కోసం పాప పది అంతస్తుల మేడపై నుంచి దూకేందుకు యత్నించే సన్నివేశం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు మరీ భయబ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయి. సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

హైలైట్స్
పాప నటన

డ్రా బ్యాక్స్
మరీ భయబ్రాంతులకు గురిచేసే సన్నివేశాలు

చివరిగా : ‘పీహూ’ పీడకలలాంటి చిత్రం
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

టైటిల్: పీహూ(హిందీ)
నటీనటులు : మైరా విశ్వకర్మ, ప్రేరణా శర్మ
సంగీతం : విశాల్‌ ఖురానా
దర్శకత్వం : వినోద్‌ కాప్రి
నిర్మాత : ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌, రాయ్‌ కపూర్‌ ఫిలింస్‌

Critics METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls