Homeపొలిటికల్ఏపీలో సినిమాలపై రాజకీయ పార్టీల ఫైట్లు

ఏపీలో సినిమాలపై రాజకీయ పార్టీల ఫైట్లు

Chandra Babu warning
ఏపీలో ప్రస్తుతం సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. టీడీపీ విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే యాత్ర, యాత్ర-2, వ్యూహం సినిమాలను రూపొందించింది.

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయంటూ తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ వేయడంతో ఆ సినిమా గతంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా అమరావతి రైతుల ఉద్యమం నేపథ్యంలో రూపొందించిన రాజధాని ఫైల్స్ చిత్రం విడుదలను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను గురువారం నిలిపివేశారు. పలుచోట్ల థియేటర్లలో సినిమా ప్రదర్శిస్తుండగా మధ్యలోనే అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించకుండా నిలిపివేశారు.

అయితే శుక్రవారం రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో థియేటర్లలో షోలు వేసేందుకు సిద్ధం అయ్యారు. కానీ అధికారులు మాత్రం చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని చూశారని థియేటర్ యాజమాన్యాలను బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినా రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు మోకాలడ్డుతున్నారని టీడీపీ నేతలు ఆరోపణలుచేశారు.

మరోవైపు రాజధాని ఫైల్స్ సినిమా అంటే జగన్ భయపడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజధాని ఫైల్స్ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు జగన్ నడిపించిన సినిమా అయిపోయిందని జగన్‌కు అసలు సినిమా ఇప్పుడే మొదలైందని కాస్కోవాలి అంటూ చంద్రబాబు సవాలు విసిరారు.

సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి కక్ష గట్టి రాజధానిని నాశనం చేశారని, అధికారం ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. జగన్ చేసిన కుట్రలు, దారుణాలు రాజధాని ఫైల్స్ చిత్రంలో కళ్లకు కట్టినట్టుగా చూపించారని చంద్రబాబు అన్నారు. సినిమా బయటకు రానీయకుండా ఆపాలని శతవిధాలా ప్రయత్నించారని కానీ వారి ఆటలు సాగలేదని దుయ్యబట్టారు.

అమరావతి రాజధాని కోసం రైతులు ఎన్నో త్యాగాలు చేశారని, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారని చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజలు ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలని చంద్రబాబు అన్నారు.

ఏపీ రాజధాని అమరావతిని ధ్వంసంచేయడం చరిత్రాత్మక విషాదం అని చంద్రబాబు అన్నారు. రాజధానిని ధ్వంసం చేసేందుకు కులాల మధ్య జగన్ కుంపట్లు రాజేశారని, విష ప్రచారాలు చేయించారని దుయ్యబట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu