Homeపొలిటికల్AP Elections 2024: బీకేర్‌ఫుల్.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటున్న చంద్రబాబు

AP Elections 2024: బీకేర్‌ఫుల్.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటున్న చంద్రబాబు

AP Elections 2024

AP Elections 2024: టీడీపీ అధినేత చంద్రబాబు.. వై ఎస్‌ జగన్‌పై రాయి దాడి విషయంపై మాట్లాడారు. వైసీపీ నేతలు చేస్తున్న చిల్లర రాజకీయాలపై ధ్వజమెత్తారు. వైసీపీ ఓటమి భయంతోనే ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నామన్నారు. ‘తప్పు చేసే అధికారులూ బీకేర్‌ ఫుల్.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు’ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.’ అని చంద్రబాబు అన్నారు.

సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలతో వైసీపీ అభాసుపాలయ్యిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. హత్యాయత్నం అంటూ తెలుగుదేశం పార్టీపై బురద వేయాలని చేసిన ప్రయత్నాలను ప్రజలు ఛీకొట్టారన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ పీకల్లోతు బురదలో కూరుకుపోయిందన్నారు. సీఎంపై దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా.. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారని చంద్రబాబు విమర్శించారు.

వీళ్లే నిందితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు తీసుకుపోయారని.. దీనిపై ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతూ నీచ ప్రయత్నాలు చేస్తోందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పడం కోసం, ప్రజలను నమ్మించడం కోసం పోలీసులతో వైసీపీ ప్రభుత్వం తప్పులు చేయిస్తోందని ఆరోపించారాయన. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, టీడీపీ ముఖ్యనేతలను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలనే పన్నాగంతో పావులు కదుపుతోందన్నారు.

ఈ క్రమంలో నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరించేలా విశ్వ ప్రయత్నాలు చేస్తోందని వైసీపీపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కీలక ఎన్నికల సమయంలో బోండా ఉమా ఎన్నికల ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తోందన్నారు.

వైసీపీ ప్రభుత్వ చర్యలను, కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ‘నేడు మళ్లీ స్పష్టంగా చెబుతున్నాం.. అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై బోండా ఉమాపై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా.. జూన్ 4వ తేదీ తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో చాలా కఠినంగా శిక్షించబడతారు.’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు చంద్రబాబు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘం కూడా అధికార దుర్వినియోగంపై దృష్టి పెట్టాలి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. సీఎంకు భద్రతను కల్పించడంలో విఫలమైన అధికారులను విచారణా బాధ్యతల నుండి తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణతో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu