రైతుల చుట్టూ రాజకీయం..!

పదవులు స్థిరమని భ్రమించేవారు, ఓట్లు గుంజి నిన్ను మరిచేవారు నీవే దిక్కని వస్తరు పదవోయ్.. రోజులు మారాయి సినిమాలోని ఏరువాక సాగరో రన్నో.. చిన్నన్న.. పాటలోని చివరి చరణంలో మాటలివి. గేయ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి 1955లోనే నేటి పరిస్థితిని గుర్తించారా? అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రతిపక్షాలు, పదవులను కాపాడుకోవడానికి పవర్‌లో ఉన్నవాళ్లు ఇప్పుడు రైతుల పాట హైపిచ్‌లో పాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చిందని పరికించడం కంటే.. ఈ పరిస్థితి వల్ల రైతుల జీవితాలు మారతాయా అని ఆలోచించడం అవసరం. ఎన్నికల వరాలతో రైతుల జీవితాలు మారతాయా?

దేశ ప్రజల్లో 70 శాతం మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయరంగం. స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతం సమకూరుస్తున్న రంగం. కోట్ల మంది ప్రజల ఆకలి తీరుస్తున్న రంగం ఇలాంటి విశేషణాలు చాలా చెప్పొచ్చు కానీ.. దేశంలో రైతుల పరిస్థితి ఏమాత్రం బాగోలేదనేది చేదు నిజం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతులను ఉద్ధరిస్తామని హామీలు గుప్పించే పాలకులు.. ఇన్నాళ్లూ మాయ మాటలతో మభ్యపెడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ పరిస్థితి మారిందా? రుణ మాఫీలు, రైతు బీమాలు, పంట రాయితీలు వంటి వన్నీ దేనికి నిదర్శనం.

అందరికీ అన్నం పెట్టే అన్నదాత నిండుగా నవ్వినప్పుడే రాజ్యం సంతోషంగా ఉన్నట్లు లెక్క. జీడీపీలు, జీఎస్టీలు ఇవేమీ లేని కాలంలో చాణక్యుడు వేసిన లెక్క ఇది. స్వాతంత్ర్యం రాగానే మన పాలకులు కూడా ఈ విషయాన్ని గ్రహించారు. మధ్యమధ్యలో పక్కన పడేసినా అవసరం వచ్చినప్పుడల్లా వ్యవసాయం అనే కాడిని పైకెత్తుకున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు, గుజరాత్‌లో వచ్చిన క్షీర విప్లవం, ఆధునిక వంగడాల అభివృద్ధి, కమతాల సగటు ఉత్పత్తి పెరగడం వంటివి ఇందులో వచ్చిన మార్పులే. కాలక్రమంలో దేశ ప్రజల అవసరాల దృష్ట్యా వ్యవసాయంలో మార్పులు, చేర్పులు వచ్చినా రైతుల జీవితాలు మారలేదు. ఈ మార్పు ఇటీవలి కాలంలో మొదలైందా?

దేశంలో ధనికులైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారని చెప్పుకునే రోజులు రావాలని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చేసిన ప్రకటన ఇది. కేవలం ప్రకటనలు చేయడమే కాదు, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ రుణాలు మాఫీతో మొదలుపెట్టి రైతుల పరిస్థితులను మార్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో చెరువులను బాగుచేసేందుకు కాకతీయు కాలంనాటి గొలుసుకట్టు చెర్వుల వ్యవస్థను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయను అమలు చేశారు.రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేందుకు ప్రాజెక్టుల రీడిజైనింగ్, ఎత్తిపోతల పథకాలను తెచ్చారు.

ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఎకరాకు రూ. 5 వేల పంట పెట్టుబడి ఇచ్చే పథకాన్ని ప్రారంభించడం చారిత్రాత్మకం. ఖరీఫ్, రబీ సీజన్‌ల కోసం ఏటా రైతు బందు పథకం కింద రూ. 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకుంది. ఈ పథకాన్ని పశ్చిమబెంగాల్ ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని మిగతా రాష్ట్రాలు, కేంద్రం కూడా అమలు చేయాలని చూస్తున్నాయి. రైతు బంధు పథకంతో పాటు.. రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా 10 రోజుల్లోగా రూ.5 లక్షల బీమా అందేలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మరో పథకం రైతు బీమా కూడామిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది.

ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి ఆ తర్వాత మరిచిపోయే పాలకులు వీధికొక్కరున్న ఈ దేశంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకోసం సంచలన పథకాలు తెచ్చింది. తెలంగాణలో ఎరువుల కొరత సమస్యను పరిష్కరించింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, ట్రాక్టర్లకు లైఫ్‌ ట్యాక్స్ రద్దు, పాల ఉత్పత్తి పెంచేందుకు రైతులకు బర్రెల సరఫరా చేస్తోంది. రానున్న కాలంలో పంట కాలనీల అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై కేసీఆర్ కసరత్తుచేస్తున్నారు. ఇవన్నీ అమల్లోకి వస్తే దేశ వ్యవసాయ రంగానికి తెలంగాణ మోరల్ స్టేట్‌గా మారడం ఖాయం.

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలే ఫలితాలను శాసించాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. కర్ణాటకలోనూ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీని అమలుచేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. వ్యవసాయరుణాల మాఫీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశంగా మారడంతో మిగతా పార్టీలు సైతం రైతు జపం చేయడం మొదలెట్టాయి. రాజకీయమంతా రైతుల చుట్టూ తిరగడం దేశంలో ప్రస్తుతం కనిపిస్తున్న మార్పు. కచ్చితంగా ఇది శుభ పరిణామంగా చెప్పొచ్చు.

CLICK HERE!! For the aha Latest Updates