Homeపొలిటికల్AP Politics: యూట్యూబర్‌కు రాజకీయాలను శాసించేటంత సీన్ ఉందా?

AP Politics: యూట్యూబర్‌కు రాజకీయాలను శాసించేటంత సీన్ ఉందా?

AP Politics

AP Politics: యూట్యూబర్ మహాసేన రాజేష్‌ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పాల్గొన్నాడు. గతంలో వైఎస్ జగన్‌కు అనుకూలంగా ఉండేవాడు. ఆ తర్వాతరూటు మార్చి జగన్‌పై విమర్శలు చేయడం ప్రారంభించాడు.. ఆ తర్వాత టీడీపీ, జనసేనకు అననుకూలంగా మాట్లాడేవాడు. తర్వాత టీడీపీలో సభ్యుడిగా చేరాడు. చంద్రబాబు, లోకేష్‌తో కలిసి తిరిగాడు. ఈ నేపథ్యంలోనే కోనసీమలోని పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం సీటును మహాసేన రాజేష్‌కు టీడీపీ కేటాయించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నందున మహాసేన రాజేష్‌కు సీటు కేటాయించడాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. మహాసేన రాజేష్ గతంలో హిందూవులను దూషించాడని, హిందూమతంపై దాడి చేశాడని ఆరోపిస్తూ రాజేష్‌కు సీటు కేటాయించడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆ తర్వాత జనసేన నేతలు సైతం మహారాజేష్‌ను వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఆ స్థానంలో జనసేనకు టికెట్ ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేశారు.

దీంతో పి.గన్నవరం నియోజకవర్గంలో రాజేష్‌కు వ్యతిరేకత వస్తుందని, అంతేకాకుండా కూటమిలో భాగమైన జనసేన కూడా అక్కడ సీటు కావాలని డిమాండ్ చేయడంతో మహాసేన రాజేష్‌కు ఇచ్చిన టికెట్‌ను టీడీపీ వెనక్కి తీసుకుంది. కానీ రాజేష్ స్వయంగా తానే పోటీనుంచి తప్పుకున్నట్టు అప్పట్లో ప్రకటించాడు. కానీ పార్టీతో అండర్‌స్టాండింగ్‌తోనే టికెట్ వెనక్కి ఇచ్చినట్టు అనిపించింది. ఆ విషయంలో టీడీపీకి, రాజేష్‌కు మధ్య ఎలాంటి తగాదా లేదు. అప్పుడు టీడీపీని గాని, జనసేన పార్టీపై గాని రాజేష్ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. ఆ తర్వాత కొద్దిరోజుల క్రితం టీడీపీలోనే ఉంటున్నాను, నా మద్దతుదారుల అభిప్రాయం కూడా అదేనని రాజేష్ ప్రకటించాడు.

అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్‌పైన, జనసేన పార్టీపైన తిరుగుబాటు చేస్తూ మహాసేన రాజేష్ వ్యాఖ్యలు చేశాడు. గతంలో పవన్ కల్యాణ్‌ను నేను పెద్దఎత్తున సమర్థించాను. చాలామంది పవన్‌పై విమర్శలుచేసినప్పుడు నేను నిలబడి వాళ్లందరికీ సమాధానం చెప్పాను. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు జనసేన పార్టీలో చేరతానని వాళ్లకు మెసేజ్ పంపించినా వాళ్లు పట్టించుకోలేదు. గతంలో పవన్ కల్యాణ్‌కు ఎంతో మద్దతు పలికిన నన్ను పార్టీలో చేర్చుకోవడానికి వాళ్లు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదో నాకు తెలియదు. ఆ తర్వాత టీడీపీ వాళ్లు నన్ను పార్టీలో చేర్చుకున్నారు. పి.గన్నవరం టికెట్ కూడా ఇచ్చారు. తర్వాత జనసేన కావాలనే నేను పోటీలో ఉండకుండా చేయాలని నాకు కేటాయించిన స్థానాన్ని తాను లాక్కోవాలని చూసింది. పక్కనే ఉన్న అమలాపురం సీటును టీడీపీకి ఇచ్చి గన్నవరం సీటును తీసుకున్నారని ఆరోపించాడు. నేను పోటీలో ఉండటం పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదు. అయినా నేను పార్టీలో అడ్జస్ట్ అయినా కూడా నా సొంత నియోజకవర్గంలో ఏ ప్రచార కార్యక్రమాల్లోనూ నన్ను కలుపుకోలేదు. నన్ను మీటింగ్‌లకు రానివ్వలేదు. మహాసేన రాజేష్‌ను ఎక్కడికీ పిలవొద్దని జనసేన వాళ్లకు పవన్ కల్యాణ్ చెప్పాడట అంటూ ఆరోపణలు చేశాడు.

పవన్ కల్యాణ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. బీజేపీ, టీడీపీ మధ్య పవన్ కల్యాణ్ పొత్తు పెట్టించారు. బీజేపీ వాళ్లు ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు. బీజేపీ పార్టీ ఎస్సీ, ఎస్టీలు, దళితులకు, మైనారిటీలకు వ్యతిరేకం. బీజేపీతో పొత్తువల్ల టీడీపీకి కూడా నష్టం వస్తుంది. టీడీపీకి గతంలో పెద్ద ఎత్తున మద్దతు ఉండేది. ఇప్పుడు పరిస్థితి పోటాపోటీగా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ బలం కొంత తగ్గింది. దీనికి కారణం పవన్ కల్యాణ్ అంటూ రాజేష్ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా బీజేపీతో పొత్తు కోసం వెళ్లినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎటువంటి హామీ తీసుకోలేదు అంటూ పలురకాల విమర్శలు చేశాడు.

మహాసేన రాజేష్ విషయంలో జనసేన పార్టీ ఎందుకు అసంతృప్తిగా ఉందో, అతనికి సీటిస్తే ఎందుకు వ్యతిరేకించిందో తెలియదు. ఆ విషయంలో రాజేష్‌కు జనసేనపై కోపం ఉండొచ్చు. ఆ విషయంలో విమర్శలు చేయొచ్చు. కానీ మహాసేన రాజేష్‌కు జనసేనపై కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. వాటికి రాజకీయ రంగు పులిమి అది ఒక సైద్ధాంతికపరమైన అంశంగా వ్యతిరేక వ్యాఖ్యలుచేయడం అందులో నిజాయితీ లేదని చెప్పాలి. ఆ విషయాన్ని మనసులో ఉంచుకుని ఎన్నికలకు ముందు కూటమిలో ఉన్న జనసేనపై రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు. పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే ప్రమాదకరం అంటూ హెడ్‌లైన్స్‌తో వీడియో చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. తన వ్యక్తిగత కోపాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం కాదా అని అంటున్నారు. రాజకీయ అంశాలు వేరు, వ్యక్తిగత అంశాలు వేరు ఈ రెండింటిని కలగాపులగం చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని విశ్లేషకులు అంటున్నారు.

పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లోనే కాదు.. ఎప్పటి నుంచో బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఆ విషయం తెలిసి గతంలో రాజేష్‌ చాలాసార్లు పవన్ కల్యాణ్‌ను నెత్తినపెట్టుకుని మాట్లాడాడు. పెద్ద ఎత్తున పొగిడాడు. జనరల్‌గా యూట్యూబర్స్ లక్షణాలు ఇలా ఉంటాయి.. అయితే నెత్తిన పెట్టుకుంటారు.. లేకుంటే పాతాళానికి తొక్కేస్తారు.. ఇలాగే మహాసేన రాజేష్‌ కూడా పవన్ కల్యాణ్‌పై గతంలో ఎంతో మద్దతుగా పెద్ద ఎత్తున పొగడ్తలు కురిపించాడు. ఎప్పటినుంచో బీజేపీతో పవన్ కల్యాణ్ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే కదా.. మరి బీజేపీ మతతత్వ పార్టీ అని అప్పుడు గుర్తుకు రాలేదా.. ఇప్పుడే తెలిసిందా.. బీజేపీ వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తారని.. బీజేపీ అనేది ముస్లింలకు, దళితులకు, ఎస్సీ,ఎస్టీలకు వ్యతిరేకం అని ఇప్పుడు తెలిసిందా.. ఇప్పుడు సడన్‌గా ప్లేటు ఫిరాయించడమే అంటూ విశ్లేషకులు మహాసేన రాజేష్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

దేశంలో మతపరమైన రిజర్వేషన్లు తీసేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అన్న సంగతి తెలిసిందే. కానీ ఏపీలో ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లులేవు. ఏపీలో ముస్లింలకు వెనుకబడిన తరగతుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అంతేగానీ ముస్లింలు అయినంత మాత్రాన అందరికీ రిజర్వేషన్లు రావు. ముస్లింలలో వెనుకబడిన తరగతుల వారిగా గుర్తించబడిన వారికి మాత్రమే 4 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉంది. మతపరమైన రిజర్వేషన్లు తీసేయడం వల్ల ఏపీలోని ముస్లింలకు ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది లేదని విశ్లేషకులు చెప్తున్నారు. అందువల్ల ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు తీసివేసే ప్రసక్తే ఉండదు. 2014లో కూడా బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంది. అయినప్పటికీ 2014 నుంచి 2019 వరకు ముస్లింలలో 14 వర్గాలకు 4 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. ఈ విషయం మహాసేన రాజేష్‌కు తెలియదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తే నేను ఊరుకోను అంటూ జగన్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అందుకోసం పవన్ కంటే జగన్ పెద్ద హీరో అని రాజేష్ అనడం అతని అమాయకత్వం, తెలివితక్కువతనం అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఏపీలో ముస్లింలకు రిజర్వేషన్లు ఎవరూ తీసేసేది లేదు.. జగన్ వచ్చి అడ్డుకునేది లేదు అని చెప్తున్నారు. రాజేష్ అలా మాట్లాడటం కేవలం రాజకీయ విమర్శలు చేయడమే అని అంటున్నారు. పవన్ కల్యాణ్‌ను, జనసేన అభ్యర్థులను నేను ఓడిస్తాను అంటూ మహాసేన రాజేష్ స్టేట్‌మెంట్ ఇవ్వడం అతడి అమాయకత్వమే. ఎందుకంటే మహాసేన రాజేష్ వంటి ఓ యూట్యూబర్ ఓడిస్తే ఓ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం, ఓ యూట్యూబర్ మద్దతిస్తే గెలవడం జరగదని, ఇవి తమని తాము ఎక్కువగా ఊహించుకోవడమేనని రాజేష్‌పై విశ్లేషకులు దుమ్మెత్తిపోస్తున్నారు.

యూట్యూబ్‌లో 4 వీడియోలు చేయగానే.. కొందరు అభినందించగానే తాను రాజకీయాలను శాసించగలను అనుకోవడం అమాయకత్వం, తెలివితక్కువ తనం అని అంటున్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి, కూటమిలో భాగస్వామ్యమైన జనసేనను ఓడిస్తానని అనడం రాజకీయంగా గాని, నైతికంగా గాని ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆ మాత్రం రాజేష్‌కు తెలియదా.. అంటున్నారు. పవన్ కల్యాణ్‌ను, జనసేనను వ్యతిరేకిస్తూ ఇలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వాలంటే ముందుగా టీడీపీలోని అధికార ప్రతినిధి పదవి నుంచి, పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాలి, లేదా టీడీపీ అధిష్ఠానానికి చెప్పి ఆ తర్వాత మాట్లాడాలి. ఏ సమయంలో ఏ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలనేది అవగాహన లేకుండా మహాసేన రాజేష్ మాట్లాడటం రాజకీయాలకు తగిన వ్యక్తి కాదని విశ్లేషకుల అభిప్రాయం. రాజేష్‌ టీడీపీలో ఉంటూ టీడీపీకి, కూటమిలో భాగస్వామి అయిన పవన్ కల్యాణ్, జనసేనపై వ్యతిరేక విమర్శలు చేయడం వైఎస్‌ఆర్‌సీపీకి, జగన్‌కు లాభం చేకూర్చడమే.. అలాగే టీడీపీకి, కూటమికి నష్టం చేకూర్చడమే కదా.. వైసీపీకి లాభం చేకూర్చాలని రాజేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని.. ఇది కరెక్ట్ కాదు కదా అని విశ్లేషకుల అభిప్రాయం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu