బీజేపీ నేతలు నాకు బంధువులు కాదు: పవన్‌

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలపై ఘాటుగా స్పందించారు పవన్‌ కల్యాణ్. అమరావతిలో నూతన జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నాదేండ్ల మనోహర్‌తో కలిసి ప్రారంభించిన ఆయన… తొలిసారి కొత్త కార్యాలయంలో మీడియాతో మట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాకేమన్న అన్నా? బీజేపీ చీఫ్ అమిత్‌షా బాబాయా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు నాకు బంధువులు కాదని స్పష్టం చేసిన ఆయన… చంద్రబాబు కన్వినెంట్ రాజకీయాలు చేయొద్దని సూచించారు. జనసేన ఆ ఉద్దేశ్యంతో స్థాపించలేదన్నారు.

రాజకీయ జవాబుదారీ తనం రావాలన్నారు జనసేనాని… నాయకులు నాలుగు సార్లు మాట మార్చితే ఎలా? అని ప్రశ్నించిన ఆయన… ప్రజలకు మాటలు చెప్పే ప్రజాప్రతినిధులు ఉన్నారే తప్ప పరిష్కారించే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై అవిశ్వాసం విషయంలో సలహా కూడా నాదేండ్లదేనని ఈ సందర్భంగా తెలిపిన పవన్… మరోవైపు ఐటీ అధికారుల దాడులపై స్పందిస్తూ… ఐటీ రైడ్స్ సచివాలయం, సీఎం ఇంటి మీద జరిగితే ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై జరిగిన విధంగా ఇక్కడ లేదని… వేరే వ్యాపారులపై ఐటీ దాడులు జరుగుతుంటే టీడీపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. సంపాదన వదిలి నేను టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేసింది రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసమేనని మరోసారి స్పష్టం చేసిన పవన్… హోదా కోసం జనసేన మాదిరి ఎవరూ గళమెత్తిందిలేదన్నారు. సీఎం మాటలు మార్చటం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్న జనసేనాని… హోదా అంశంపై అఖిలపక్ష సమావేశం పెడితే మేం కలిసి వస్తామన్నారు పవన్‌. అఖిల పక్షంగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలుద్దామని సూచించారు. గతంలో పెట్టిన అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో పెట్టలేదన్న పవన్… అందరూ సమిష్టిగా పోరాటం చేయాలి, కలిసి రావాలన్నారు. ఇక జేఎఫ్‌సీ నివేదిక చూసి చర్యలు తీసుకోవాల్సింది చంద్రబాబే అన్నారు జనసేన అధానేత పవన్‌ కల్యాణ్.