ప్రభాస్ కు ముప్పై కోట్లా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ‘బాహుబలి’ సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా  ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. ఇతర బాషల్లో కూడా ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది. దీంతో ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో.. అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. బాహుబలి సినిమా కోసం మిగిలిన సినిమా ఆఫర్లన్నీ  వదిలేసుకొని దాదాపు మూడు సంవత్సరాల పాటు తన సమయాన్ని కేటాయించినందుకు గాను.. ఆయన 15 కోట్ల రూపాయలను పారితోషికం  తీసుకున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు త్వరలోనే సుజీత్ దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమా కోసం ప్రభాస్ కు కనీసం 30 కోట్ల రూపాయలను ముట్టజెప్పనున్నట్లు  చెబుతున్నారు. అదే గనుక నిజమైతే ఇప్పటివరకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న తెలుగు హీరోల్లో మొదటి వ్యక్తిగా ప్రభాస్ పేరు  ఉండడం ఖాయం. మొత్తానికి ప్రభాస్ టాలీవుడ్ కు నెంబర్ వన్ హీరో అయిపోయాడనే చెప్పాలి!