అత్యంత శక్తిమంతమైన మహిళగా ప్రియాంకా చోప్రా


గ్లోబల్‌ ఐకాన్‌ ప్రియాంకా చోప్రా మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. వినోద రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఆమె చోటుదక్కించుకున్నారు. ఈ మేరకు యూఎస్‌ఏ టుడే ‘విమెన్‌ ఇన్‌ ది వరల్డ్‌ సమ్మిట్‌ 2019’ జాబితాను ప్రకటించింది. ఇందులో ప్రియాంక అమెరికాకు చెందిన స్టార్స్‌ ఓప్రా విన్‌ఫ్రే, మెరిల్‌ స్ట్రీప్‌లతోపాటు ఉన్నారు. న్యూయార్క్‌లో ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు వేడుక జరగనుంది. ఈ జాబితాలో గాయని బియాన్సే, టీవీ స్టార్‌ ఎలెన్‌ దెజానరెస్‌, జెన్సీఫర్‌ లారెన్స్‌, జెన్సీఫర్‌ లోపెజ్‌ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ‘సవాళ్లను ఎదుర్కొంటూ.. సొంతంగా తమకంటూ ఓ ప్రత్యేకమైన మార్గం ఏర్పరచుకుని.. ఎంచుకున్న కెరీర్‌లో గర్వంగా రాణిస్తున్న ఇలాంటి అద్భుతమైన మహిళలతో కలిసి వేదిక పంచుకోబోతుండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది నా విజయం అనే భావన కల్గుతోంది’ అని ప్రియాంక పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు.
అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’ తో ప్రియాంక అంతర్జాతీయంగా ఫేమస్‌ అయ్యారు. 2017లో ‘బేవాచ్‌’ సినిమాతో ఆమె నటిగా హాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఇటీవల ఆమె అమెరికాకు చెందిన గాయకుడు నిక్‌ జొనాస్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వాసిమ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.