ఏపీ ఈ దేశంలో భాగం కాదా?: రాహుల్‌

ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ ప్రధాని మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకిచ్చిన హామీలను ఆయన విస్మరించారన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొన్నారు. దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారని దుయ్యబట్టారు. ప్రధాని ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడతారని ధ్వజమెత్తారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండా అబద్ధాలు చెబుతారని విమర్శించారు. ప్రధాని మోడీకి విశ్వసనీయత లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ఏపీ ప్రజల సొమ్మును దోచి అంబానీకి కట్టబెట్టారన్నారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు.