రివ్యూ: మీలో ఎవరు కోటీశ్వరుడు

బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నటీనటులు: పృధ్వీ, నవీన్ చంద్ర, సలోని, శృతి సోది, పోసాని కృష్ణమురళి, మురళీశర్మతదితరులు
సంగీతం: శ్రీ వసంత్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటింగ్: గౌతమ్ రాజు
నిర్మాత: కె.కె.రాధామోహన్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఇ.సత్తిబాబు
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో.. సమీక్షలోకి
వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
ప్రియ(శృతి సోది) స్నేహితులతో కలిసి మధ్యం సేవించి అర్ధరాత్రి రోడ్ మీద నడుస్తూ ఉంటుంది. తనను ఆ పరిస్థితిలో చూసిన ప్రశాంత్(నవీన్ చంద్ర) సేఫ్ గా తన ఇంట్లో డ్రాప్ చేస్తాడు. మొదట అతడ్ని అనుమానించిన ప్రియ, ప్రశాంత్ మంచితనం తెలుసుకొని ప్రేమలో పడుతుంది. కానీ ప్రశాంత్ మాత్రం ప్రియను ప్రేమించడు. ఓ వారం రోజుల పాటు తనతో ట్రావెల్ అవ్వమని చెప్పిన ప్రియను తీసుకొని తన సొంతురుకి వెళ్తాడు ప్రశాంత్. ప్రియ తన కుటుంబ సభ్యులతో కలిసిపోవడం చూసి ప్రశాంత్ కు కూడా ప్రియపై ప్రేమ కలుగుతుంది. కానీ ప్రియ తండ్రి వారి ప్రేమను అంగీకరించరు. సంపన్న కుటుంబానికి చెందిన ప్రియను పెళ్లి చేసుకునే అర్హత నీకేముందని ప్రశాంత్ ను ప్రశ్నిస్తాడు. అయితే ప్రశాంత్ తెలివిగా ప్రియ తండ్రికి ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ పట్టుకొని అందులో తనే నెగ్గాలని ప్రియ తండ్రి ప్రయత్నిస్తాడు. అందులో భాగంగా ఐడియా ఇచ్చిన వారికి కోటి రూపాయలని పేపర్ లో అనౌన్స్ చేస్తారు..? ఆ యాడ్ చూసి వచ్చిన తాతారావు(పోసాని కృష్ణమురళి) అతడిని మెప్పించేలా ఓ ఐడియా ఇస్తాడు. ఆ  తరువాత ఏం జరిగింది..? ఇంతకీ ఆ ఐడియా ఏంటి..? ప్రశాంత్ చేసిన ఛాలెంజ్ ఏంటి..? కోటిరూపాయలు ఒక్క ఐడియా కోసం ఇవ్వడం పట్ల ప్రియ తండ్రి ఆంతర్యం ఏంటి..? చిరవకు ప్రియ, ప్రశాంత్ ల ప్రేమ గెలిచిందా..? సినిమా ట్రైలర్ లో తెగ హడావిడి చేసిన పృధ్వీ పాత్ర ఎలా ఉండబోతోంది..? వీటన్నింటికీ సమాధానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
పృధ్వీ
ఇంటర్వల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్:
కథ, కథనం
సినిమాటోగ్రఫీ
ఫస్ట్ హాఫ్
సాగతీత

విశ్లేషణ:
సినిమాల పట్ల ప్రేక్షకుల ఆలోచనా విధానం మారింది. కంటెంట్ ఉంటే చాలు ఎంత చిన్న సినిమా అయినా.. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ లేకుండా వచ్చిన భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. స్టార్ హీరోలు సైతం కథలో సత్తా కోసమే చూస్తున్నారు కానీ కామెడీను, కాంబినేషన్స్ ను నమ్మడం లేదు. అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా మాత్రం పూర్తిగా కామెడీను నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు అసలు ఏ కథను రాసుకొని దాన్ని సినిమాగా చేశాడో.. ఆయనకే తెలియాలి. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. లాజిక్స్ అంతకంటే లేవు.. ఒక్క కామెడీను నమ్ముకొని సినిమా చేసేశారు.

నవీన్ చంద్ర పాత్ర గెస్ట్ రోల్ మాదిరి అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తంలో అతడు మహా అయితే ఓ రెండు ఫ్రేముల్లో కనిపిస్తాడు. శ్రుతిసోది పాత్ర సో.. సో.. గా అనిపిస్తుంది. కొన్ని ఫ్రేమ్స్ లో ఆమెను చూడడానికి కష్టంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర అంటే పృధ్వీ దే. ఇంటర్వల్ బ్యాంగ్ లో ఆయన చెప్పే స్పూఫ్ డైలాగ్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే అదే విధానం సినిమా సెకండ్ హాఫ్ మొత్తం కంటిన్యూ చేయడం వలన విసుగు వచ్చేస్తుంది. మురళీశర్మ ఉన్నంతలో బాగా నటించారు. పోసాని కృష్ణమురళి తన నటనతో మెప్పించారు. సలోని కూడా తన నటనతో ఓకే అనిపించింది.

టెక్నికల్ సినిమా చాలా లో బడ్జెట్ లో తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ నాసిరకంగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే మెలోడీ సాంగ్ వినడానికి బావుంది. పృద్వీ, సలోని ల మధ్య వచ్చే పెప్పీ సాంగ్ నవ్విస్తుంది. కథకు తగ్గట్లుగా నేపధ్య సంగీతం ఉంది. రెగ్యులర్ కథకు స్పూఫ్ కామెడీ జోడించి తీసిన సినిమాలు చాలానే వచ్చాయి. మళ్ళీ అదే ఫార్ములాలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం కష్టమే. అయితే ఎలాంటి లాజిక్స్, కథతో సంబంధం లేకుండా సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం సినిమా పెద్దగా నచ్చదు.

రేటింగ్: 2/5