
Rajat Dalal hit and run:
ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ Rajat Dalal ఈసారి తన ర్యాష్ డ్రైవింగ్ వల్ల చిక్కుల్లో పడ్డారు. జూన్‌లో ఓ 18 ఏళ్ల విద్యార్థిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలైన రాజత్, తాజాగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ హైవేలో హిట్-అండ్-రన్ కేసులో పట్టుబడ్డాడు. ఈ ఘటన ఒక ప్రయాణికుడు తన ఫోన్‌లో రికార్డు చేయగా.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఈ వీడియోలో రాజత్ దలాల్ బాగా రద్దీగా ఉన్న ఒక హైవేలో 143 కిమీ వేగంతో కారును నడుపుతూ కనిపించారు. ఈ క్రమంలో అతని కారు ఓ బైకర్‌ను గుద్దేసింది. ఆ సమయంలో పక్కన ఉన్న మహిళ “సర్, సర్, సర్, గిర్ గయా వో, అయిసే మత్ కరో (అతను పడిపోయాడు. అలా చెయ్యద్దు)” అని కంగారుగా అనగా, రాజత్ “వో గిర్ గయా కోయీ బాత్ నహీ (పడిపోయినా పర్లేదులే)” అని నిర్లక్ష్యంగా స్పందించాడు. అది చాలదు అన్నట్టు “రోజ్ కా యాహీ కామ్ హై మేడమ్ (ఇది నేను రోజు చేసే పనే మేడం)” అని చాలా సరదాగా చెప్పాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. రాజత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రఖ్యాత జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెకర్ అయిన మహమ్మద్ జుబైర్ ఈ వీడియోను షేర్ చేయగా, 268K కి పైగా వ్యూస్, రజత్ ను తిడుతూ బోలెడు కామెంట్స్ వచ్చాయి.
ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ జుబైర్ పోస్ట్‌కి స్పందిస్తూ, “ఈ వీడియో జిల్లా యంత్రాంగం, ఫరీదాబాద్ పోలీసులకు దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు కానీ పోలీసులు స్వతహాగా చర్య తీసుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది, దోషిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.
ఈ వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తూ, “ఇలాంటి వ్యక్తుల కారణంగానే మానవత్వం కనిపించడం లేదు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. ఇంకొకరు ఇది ఓవర్ స్పీడింగ్, హిట్ అండ్ రన్ కేసు అని.. మరింత విచారకరమైన విషయం ఏంటంటే అతనికి పశ్చాత్తాపం లేదు అని అన్నారు.













